ఆసక్తికరంగా కుమారస్వామి మంత్రి వర్గ విస్తరణ.

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 11:29 AM

కర్ణాటకలోని అధికార సంకీర్ణ కూటమిలో నెలకొన్న అసమ్మతిని పారద్రోలి ప్రభుత్వానికి స్థిరత్వం కల్పించే ప్లాన్ లో భాగంగా ముఖ్యమంత్రి కుమారస్వామి నిన్న తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టారు. రానెబెన్నూర్‌ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్‌ శంకర్‌, ముల్‌బగల్‌ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హెచ్‌. నగేష్‌లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య మంత్రి కుమార స్వామి, ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర సమక్షంలో గవర్నర్‌ వజూభారు ఆర్‌. వాలా ఇద్దరు ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ ముఖ్యమంత్రి , కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నేత సిద్ధరా మయ్య, హోం మంత్రి ఎం.బి. పాటిల్‌, మంత్రులు, కాంగ్రెస్‌, జెడి(ఎస్‌) నేతలు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. నిజానికి ప్రస్తుతం కాంగ్రెస్‌లో మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఏకంగా 12-15మంది దాకా ఉన్నారు.

అసంతృప్తి తీవ్రంగా ఉందని భావించి సీనియర్‌లలో కొందరిని కేబినెట్‌నుంచి తొలగించి ఇతరులకు అవకాశం ఇవ్వాలని తొలుత భావించినా అలా చేయాలనుకుంటే ఎవరిని తొలగించాలనే అంశం కంటే ఎవరికి న్యాయం చేయాలనేది పెను సమస్యగా మారనుంది. దీంతో తేనెతుట్టెను కదపడం కంటే ఖాళీగా ఉండే రెండు స్థానాలను ఇరువురు స్వతంత్రులతో భర్తీ చేసి చేతులు కడుక్కోవడమే మంచిదని కాంగ్రెస్‌ ముఖ్యనేతలు నిర్ణయించారు. అందుకే నిన్న స్వతంత్ర ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ ప్రమాణస్వీకారం 12న చేయాలని భావించినా ప్రముఖ నటుడు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గిరీష్‌ కర్నాడ్‌ మృతితో కార్యక్రమం వాయిదా పడింది.





Untitled Document
Advertisements