ఆయిల్ ట్యాంకర్లపై దాడి చేసింది ఇరానే!

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 11:35 AM

ఆయిల్ ట్యాంకర్లపై దాడి చేసింది ఇరానే!

ఇస్తాంబుల్: ఒమన్‌గల్ప్‌లో గురువారం రెండు ఆయిల్ ట్యాంకర్లు దాడులకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఆ దాడులు చేసింది ఇరానే అని ఆరోపిస్తూ అమెరికా సెంట్రల్ కమాండ్ దీనికి సంబంధించిన ఒక వీడియోను తాజాగా విడుదల చేసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దళాలు ఒక చిన్న నౌకలో వచ్చి జపాన్ చమురు నౌక ‘కోకుకా కరేజియన్’పై దాడికి ఉపయోగించిన పేలని మైన్‌ను తొలగించినట్లు ఆ వీడియోలో ఉందని అమెరికా ఆరోపిస్తుంది. సాక్షాలు లేకుండా చేయడం కోసమే ఇరాన్ దళాలు మైన్ ను తొలగించాయని ఆరోపించింది. అయితే ఆ వీడియో అంత స్పష్టంగా లేకున్నా రివల్యూషనరీ గార్డు దళాలు వచ్చినట్లు మాత్రం కనిపిస్తోంది. మైన్ పేలుడు వల్లే రెండు చమురు నౌకలు దెబ్బతిన్నట్లు మాత్రం తర్వాత తీసిన చిత్రాల్లో స్పష్టమైంది. కోకుకా కరేజియన్ నౌకలోని నావికులను, ఇతర సిబ్బందిని తమ నావికాదళం కాపాడినట్లు అమెరికా తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది.అమెరికా నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ఇరాన్ విదేశాంగమంత్రి మహమ్మద్ జావేద్ జాఫ్రీ శుక్రవారం ఒక ట్వీట్‌లో దుయ్యబట్టారు. అంతేకాదు, జపాన్ ప్రధాని షింజో అబే ఇరాన్‌లో పర్యటించనుండడంతో దాన్ని దెబ్బతీయడం కోసం, అలాగే ఏకపక్ష ఆంక్షల ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్న తన ఆర్థిక టెర్రరిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి అమెరికా చేస్తున్న ‘ విద్రోహ దౌత్యం’గా దీన్ని ఆయన అభివర్ణించారు. కాగా, ఈ దాడుల కారణంగా అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతుండడంతో పూర్తి సంయమనం పాటించాలని యూరోపియన్ యూనియన్ ఆ రెండు దేశాలకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు గల్ఫ్‌లో మరోసారి యుద్ధ్ధ వాతావరణాన్ని ప్రపంచం భరించే స్థితిలో లేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరిస్ హెచ్చరించారు.





Untitled Document
Advertisements