పాక్ టీవీ యాడ్ కు ఇండియా రిటర్న్ గిఫ్ట్

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 04:04 PM

పాక్ టీవీ యాడ్ కు ఇండియా రిటర్న్ గిఫ్ట్

ప్రపంచకప్ మెగా సిరీస్ లో భాగంగా పాక్-భారత్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాక్ తాజాగా ఓ టీవీ యాడ్ ను రిలీజ్ చేసింది. అయితే ఈ యాడ్ లో భారత వైమానిక దళానికి చెందిన వర్ధమాన్ అభినందన్ ను కించపరిచేలా ఉండడంతో భారత అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ యాడ్‌కు సమాధానంగా ఇండియాకు చెందిన యూట్యూబ్ చానల్ ‘వి సెవన్ పిక్చర్స్’ శుక్రవారం ‘మౌకా మౌకా’ అనే వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో చూసిన భారత క్రికెట్ అభిమానులు చివరి సన్నివేశం చూసి విజిల్స్ వేస్తున్నారు. భలే సమాధానం చెప్పావ్ గురూ అని పొగిడేస్తున్నారు. ఒక రోజు వ్యవధిలో ఈ వీడియోను 9.9 లక్షల మంది వీక్షించడం గమనార్హం. భారత క్రికెట్ అభిమాని సెలూన్‌లో ఉండగా.. పాక్ అభిమాని అక్కడికి వచ్చి ‘ఫాదర్స్ డే’ గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్టును తెరిచి చూస్తే అందులో రుమాల్ ఉంటుంది. అదేంటీ రుమాల్ ఇచ్చావని భారత అభిమాని అడుగుతాడు. ‘‘ఉంచుకో, మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత ముఖం దాచుకోడానికి పనికి వస్తుంది’’ అని అంటాడు. అనంతరం సేవింగ్ చేయించుకోడానికి సిద్ధమవుతూ.. ‘‘ఈ గేమ్ చాలా దారుణంగా ఉంటుంది. ఒకే రోజులో కొడుకు తండ్రైపోతాడు’’ అని పంచ్ వేస్తాడు. దీంతో భారత అభిమానికి, బార్బర్‌కు కోపం వస్తుంది. భారత అభిమాని బార్బర్‌కు కంటితో సైగ చేస్తాడు. దీంతో బార్బర్ పాక్ అభిమానికి అభినందన్ తరహాలో గెడ్డం, మీసాలను కట్ చేస్తాడు. అది చూసి పాక్ అభిమాని బావురమంటాడు. ‘‘ఇది అభినందన్ స్టైల్. అతను మా హీరో’’ అని భారత అభిమాని సమాధానం ఇస్తాడు. ‘‘అతడు మా హీరో కాదు. బయట నా స్నేహితులు ఉన్నారు. నా ముఖం ఎలా చూపించుకోవాలి’’ అని పాక్ అభిమాని ఏడుపు ముఖం పెడతాడు. దీంతో భారత అభిమాని అతడికి రుమాల్ తిరిగిచ్చి ‘‘దీనితో నీ ముఖాన్ని దాచుకో’’ అనడంతో వీడియో ముగుస్తుంది. దీంతో ‘ఫాదర్స్ డే’ రిటర్న్ గిఫ్ట్ అదుర్స్ అంటూ భారత నెటిజన్స్ ఈ వీడియోను షేర్లు మీద షేర్లు చేసుకుంటున్నారు.





Untitled Document
Advertisements