ప్రకాశ్ రాజ్ తో భార్య సెల్ఫీని డిలీట్ చేయించిన భర్త....కారణం తెలిస్తే షాక్

     Written by : smtv Desk | Sat, Jun 15, 2019, 04:18 PM

ప్రకాశ్ రాజ్ తో భార్య సెల్ఫీని డిలీట్ చేయించిన భర్త....కారణం తెలిస్తే షాక్

ప్రముఖ నటుడు, ఔత్సాహిక రాజకీయవేత్త ప్రకాశ్ రాజ్ గుల్మార్గ్ లోని తన హోటల్ కు నడుచుకుంటూ వెళుతుండగా, ఓ మహిళ తన కుమార్తెతో కలిసి ప్రకాశ్ రాజ్ వద్దకు వచ్చారు. ఆయన్ను మర్యాదపూర్వకంగా పలకరించారు. ఆపై ఓ సెల్ఫీ కావాలని అడగడంతో ప్రకాశ్ రాజ్ అంగీకరించారు. సెల్ఫీ తీసుకుని పక్కకి వస్తున్న సమయంలో ఆమె భర్త ఎంటరయ్యాడు.

భార్య ముఖంలో సంతోషం చూసి ఒక్కసారిగా రౌద్రరూపం దాల్చాడు. భార్యను పక్కకి లాగి, వెంటనే ఫోన్ లోంచి ఆ సెల్ఫీ డిలీట్ చేయమని రంకెలు వేశాడు. భర్త తీరుతో ఆమె కన్నీటిపర్యంతమైంది. ఇంతకీ ఆ వ్యక్తి ప్రకాశ్ రాజ్ తో సెల్ఫీని వ్యతిరేకించడానికి కారణం మోదీపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలేనట!. ఈ విషయం అతడి ద్వారానే తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ వెంటనే స్పందించారు.

ఆ మహిళ భర్తను పక్కకి తీసుకెళ్లి ప్రత్యేకంగా మాట్లాడారు. "ఏమండీ, మిమ్మల్ని మీ భార్య పెళ్లిచేసుకోవడానికి, మీకు అందమైన కుమార్తెను ఇచ్చి మీతో జీవితం పంచుకోవడానికి నేను, మోదీ ఏవిధంగానూ కారణం కాదు. మోదీపై నేను వ్యాఖ్యలు చేశానని మీరు మీ భార్యను కోప్పడడంలో అర్థంలేదు. వాళ్లు మీ అభిప్రాయాలను ఎలా గౌరవిస్తున్నారో, మీరు కూడా మీ భార్యబిడ్డల అభిప్రాయాలను గౌరవించండి. ఇలాంటి విషయాల కోసం టూర్ ను పాడుచేసుకుంటారా, హాయిగా ఆస్వాదించండి" అంటూ క్లాస్ తీసుకున్నారు.





Untitled Document
Advertisements