టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 11:10 AM

తెలంగాణలో కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అదేమీ లేదని అన్న వెంకట రెడ్డి కవర్ చేసుకున్నా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు వింటే ఆ విషయం నిజమే అనిపించకమానదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని తేల్చి చెప్పిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన కుండ బద్దలు కొట్టేసారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుపెట్టుకోవడం వల్ల పార్టీకి తీరని అన్యాయం జరిగిందని అదే పార్టీ కొంపముంచిందని ఆరోపించారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీని చేజేతులా నాశనం చేసుకున్నామని తెలిపారు. అంతే కాక తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి రాష్ట్ర నాయకత్వమే కారణమని అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని యువ నాయకత్వానికి అప్పగిస్తారని భావించామని, కానీ అలా జరగలేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దుస్థితికి నైతిక బాధ్యతగా రాహుల్ గాంధీ తప్పుకుంటే, తెలంగాణలో టీపీసీసీ చీఫ్ అలా ఆలోచించలేకపోయాడని విమర్శించారు. ఇప్పటికిప్పుడు పార్టీ మారే యోచన లేదన్న ఆయన.. పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ మారాలని ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదని చెప్పడం తో కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందేమో చూడాలి.





Untitled Document
Advertisements