కీలక వ్యాఖ్యలు చేసిన ఎస్‌‌బీఐ ఎండీ

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 04:47 PM

న్యూఢిల్లీ: నాన్‌‌ బ్యాంకింగ్‌‌ ఫైనాన్స్‌‌ కంపెనీలకు (NBFC) అప్పులు ఇవ్వడాన్ని ఆపేయలేదని, ఇక నుంచి కూడా కొనసాగిస్తామని ఎస్‌‌బీఐ ఎండీ అరిజిత్‌‌ బసు ప్రకటించారు. ఎన్‌‌బీఎఫ్‌‌సీల రంగం పరిస్థితి మరీ దారుణంగా ఏమీ లేదని, ఒకటి రెండు కంపెనీలే ఇబ్బందిపడుతున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా లిక్విడిటీ కొరత పెరగడం, కొన్ని ఎన్‌‌బీఎఫ్‌‌సీలు దివాలా తీయడంపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఎస్‌‌బీఐ అధిపతి ఈ వ్యాఖ్యలు చేశారు. లిక్విడిటీ కొరత ఎదుర్కొంటున్న ఐఎల్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ వంటి ఎన్‌‌బీఎఫ్‌‌సీలు కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకోవాలని బసు సూచించారు. కంపెనీ ఏ మేరకు రిస్కు ఎదుర్కొంటున్నదనే విషయాన్ని నిర్ధారించాకే లోన్‌‌పై నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు.

ఢిల్లీలో శనివారం జరిగిన ఐఎంసీ బ్యాంకింగ్‌‌ అండ్‌‌ పైనాన్స్‌‌ కాన్ఫరెన్స్ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌‌బీఎఫ్‌‌సీ సెక్టార్‌‌ సమస్యలను పరిష్కరించడానికి ఆర్‌‌బీఐతోపాటు కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకున్నాయని ప్రశంసించారు. బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలపై ఆర్‌‌బీఐ జూన్‌‌ ఏడో తేదీ నాటి సర్కులర్‌‌లో లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది మార్చి వరకు ఎస్‌‌బీఐ ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు రూ.1.87 లక్షల కోట్ల విలువైన లోన్లు ఇచ్చిందని చెప్పారు. హౌసింగ్‌‌ కంపెనీలకు రూ.62,511 కోట్లు, ప్రభుత్వ అధీనంలోని ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు రూ.63,033 కోట్లు, పెద్ద ప్రైవేటు కంపెనీలకు రూ.67,226 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. తమ పుస్తకాల్లో ఎన్‌‌బీఎఫ్‌‌సీ అసెట్‌‌ పోర్ట్‌‌ఫోలియో నాణ్యత బాగుందని బసు ప్రకటించారు.





Untitled Document
Advertisements