శ్రీ లంక ని చిత్తూ చేసిన కంగారూలు

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 04:57 PM

ప్రపంచకప్‌లో ఆసీస్‌ మరో విజయంతో మురిసింది. శ్రీలంకతో జరిగిన పోరులో ఆస్ట్రేలియా 87పరుగుల తేడాతో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. టాస్‌ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 334పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఫించ్‌ ఈ మ్యాచులో తనదైన శైలిలో ఆడాడు. ఒక ఎండ్‌లో డేవిడ్‌ వార్నర్‌ ఆచితూచి ఆడుతుంటే ఫించ్‌ మాత్రం బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. అర్ధ శతకం సాధించాడు. జట్టు స్కోరు 80 వద్ద వార్నర్‌, 100 వద్ద ఖవాజా వెనుదిరిగారు. ఈ క్రమంలో స్టీవ్‌ స్మిత్‌తో కలిసి మూడో వికెట్‌కు ఫించ్‌ 173 పరుగుల భారీ భాగస్వామ్యం అందించాడు. శతకం సాధించిన తర్వాత రెచ్చిపోయాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే ఉడాన వేసిన 42.4వ బంతికి భారీ షాట్‌ ఆడబోయి కరుణరత్నె చేతికి చిక్కాడు. తర్వాత దూకుడుగా ఆడుతున్న స్మిత్‌ కూడా 73 పరుగులు చేసి ఔటయ్యాడు. వరుస బౌండరీలతో రెచ్చిపోయినా మాక్స్‌వెల్‌ 46 పరుగులు చేశాడు. ఆ తర్వాత కారె, కమిన్స్‌, షాన్‌మార్ష్‌ వెంటవెంటనే ఔటయ్యారు. చివరి ఐదు ఓవర్లలో లంక బౌలర్లు పుంజుకోవడంతో ఆసీస్‌ 3 వికెట్లు నష్టపోయి కేవలం 35 పరుగులే చేయగలిగింది. దీంతో 50ఓవర్లలో ఆసీస్‌ 334పరుగులకు ఆలౌటైంది. లంక బౌలర్లలో ఇసురు ఉదానా, ధనంజయ డి సిల్వాలు చెరో 2 వికెట్లను తీయగా, లసిత్ మలింగా 1 వికెట్ తీశాడు.

భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకకు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. కరుణరత్నె- కుశాల్‌ పెరీరా జోడీ ప్రారంభంనుంచే భారీ షాట్లతో రెచ్చిపోయారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 115 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆరంభంలో వీరి జోరు చూస్తే.. లంకకు విజయం ఖాయమన్నట్లే కనిపించింది.కానీ, ఆసీస్‌ బౌలర్లు రెచ్చిపోవడంతో లంకకు ఓటమి తప్పలేదు. ఓపెనర్‌ కుశాల్‌ పెరీరా అర్ధశతకం పూర్తి చేసుకున్నాక స్టార్క్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. తిరుమన్నె కూడా వెంటనే ఔట్‌ అయ్యాడు. తర్వాత కుశాల్‌ మెండిస్‌తో కాసేపు ఇన్నింగ్స్‌ నడిపించిన కరుణరత్నె శతకానికి చేరవయ్యే క్రమంలో రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌ చేతికి చిక్కాడు. అప్పటికి జట్టు స్కోరు 186పరుగులు. కాసేపు కుశాల్‌ మెండిస్‌ పోరాడినట్లే కనిపించాడు. కానీ దూకుడు పెంచే క్రమంలో 39ఓవర్‌లో స్టార్క్‌ బౌలింగ్‌లో కీపర్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లే పెవిలియన్‌కు వరుస కట్టడంతో లంక పోరాటం 45.5ఓవర్లలోనే ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ 4, రిచర్డ్‌సన్‌ 3, కమిన్స్‌ రెండు వికెట్లు తీశారు.

ఈ ఓటమితో లంక సెమీస్‌ అవకాశాలు సన్నగిల్లాయి. ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ గెలిస్తూ భారీ రన్‌రేట్‌ సాధిస్తే తప్ప ఆ జట్టు సెమీస్‌కు చేరే అవకాశం లేదు.

మొత్తానికి అద్భుత శతకంతో రెచ్చిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఫించ్‌ కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచిన కంగారూలు పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌ లో ఉన్నారు. ఐదింట్లో ఒక్క మ్యాచ్‌ గెలిచిన శ్రీలంక ఐదో స్థానంలో ఉంది.





Untitled Document
Advertisements