పసికూనపై పంజా విప్పిన సౌత్ ఆఫ్రికా

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 05:01 PM

ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా గెలుపు బోణీ కొట్టింది. శనివారం అఫ్గానిస్తాన్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సఫారీ జట్టు 9 వికెట్లతో జయభేరి మోగించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ జట్టు 20 ఓవర్లకు 69/2 స్కోరుతో ఉండగా వర్షం గంటపాటు అంతరాయం కలిగింది. అంతకుముందూ 25 నిమిషాలు ఆటకు ఆటంకం ఏర్పడింది. దీంతో డక్‌వర్త్‌ లూయీస్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు. అయితే, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇమ్రాన్‌ తాహిర్‌ (4/29), క్రిస్‌ మోరిస్‌ (3/13) ధాటికి అఫ్గాన్లు 34.1 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటయ్యారు.

రషీద్‌ ఖాన్‌ (25 బంతుల్లో 35; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్‌ (22; 3 ఫోర్లు), నూర్‌ అలీ జద్రాన్‌ (32; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 48 ఓవర్లలో 127గా సవరించారు. సఫారీలు 28.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి విజయానందాన్ని పొందారు. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (72 బంతుల్లో 68; 8 ఫోర్లు), హషీమ్‌ ఆమ్లా (83 బంతుల్లో 41 నాటౌట్‌; 4 ఫోర్లు) శతక భాగస్వామ్యం అందించారు. డికాక్‌ ఔటయ్యాక వన్‌డౌన్‌లో వచ్చిన ఫెలూక్వాయో (17 బంతుల్లో 17 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) సిక్స్‌తో లాంఛనం ముగించాడు.





Untitled Document
Advertisements