స్విస్ బ్యాంకుల్లో అక్రమ సంపద.....50 మంది భారతీయ నల్ల కుబేరులపై బిగుస్తున్న ఉచ్చు

     Written by : smtv Desk | Sun, Jun 16, 2019, 05:08 PM

స్విస్ బ్యాంకుల్లో అక్రమ సంపద.....50 మంది భారతీయ నల్ల కుబేరులపై బిగుస్తున్న ఉచ్చు

స్విస్ బ్యాంకుల్లో అక్రమ సంపదను దాచుకున్న నల్ల కుబేరులపై ఉచ్చు బిగుస్తోంది. వీరిపై కొరడా ఝళిపించేందుకు భారత దేశం, స్విట్జర్లాండ్ దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనాన్ని పోగేసుకున్న సుమారు 50 మంది భారతీయుల వివరాలను భారత దేశానికి అందజేసే ప్రక్రియను స్విస్ అధికారులు ప్రారంభించారు. నల్ల ధనానికి స్వర్గధామం అనే పేరును వదిలించుకోవడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 నుంచి చేస్తున్న కృషి వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కూడా మరింత పటిష్టమయ్యాయి.

కొద్ది వారాల క్రితం సుమారు 50 మంది భారతీయులకు నోటీసులు జారీ చేసినట్లు స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. వీరి వివరాలను భారత ప్రభుత్వంతో పంచుకోవడానికి స్విస్ ప్రభుత్వ ప్రతిపాదనపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని వీరిని కోరినట్లు తెలిపింది. వీరిలో కొందరి ప్రాథమిక అపీళ్ళను ఇప్పటికే తిరస్కరించినట్లు తెలిపింది. గత ఏడాదిలో సుమారు 100 మంది భారతీయ నల్ల కుబేరుల వివరాలను భారత ప్రభుత్వానికి అందజేసినట్లు స్విస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న అత్యధిక కేసుల విషయంలో రాబోయే కొద్ది నెలల్లో పరిపాలనాపరమైన సహాయాన్ని కూడా అందజేస్తామని తెలిపారు.





Untitled Document
Advertisements