ఇప్పుడు ఆ 243 మంది ఏమైయ్యారు?

     Written by : smtv Desk | Mon, Jun 17, 2019, 11:30 AM

ఇప్పుడు ఆ 243 మంది ఏమైయ్యారు?

విదేశీ మోజు ఓవైపు, అధిక వేతనాలు లభిస్తాయన్న ఆశ మరోవైపు 243 మందిని అక్రమంగా విదేశాల బాట పట్టించింది. అయితే, కేరళ నుంచి ఓ బోటులో బయల్దేరిన వారు నెలలు గడుస్తున్నా తమవారికి ఫోన్లు చేయకపోవడంతో ఇప్పుడు వారి ఆచూకీ మిస్టరీగా మారింది. కేరళలోని ఎర్నాకుళం తీరం నుంచి ఓ ఫిషింగ్ బోటులో బయల్దేరిన వ్యక్తుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.

జనవరి 12న బోటు బయల్దేరగా, కోచి తీరం సమీపంలో కేరళ పోలీసులకు కొంత లగేజి దొరికింది. దాదాపు 50 బ్యాగులు, కొన్ని ఐడెంటిటీ కార్డులు లభ్యమయ్యాయి. బోటులో స్థలం సరిపోక తీరంలోన లగేజి వదిలేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఆ బోటు ఎక్కినవాళ్ల లక్ష్యం న్యూజిలాండ్ వెళ్లడమేనని తెలుస్తోంది. కానీ ఆ బోటు ఆస్ట్రేలియా అధీనంలోని క్రిస్మస్ ఐలాండ్ చేరుకుని ఉండొచ్చని, అల్జీరియా భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుందని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వీళ్లందరినీ ఢిల్లీ, కేరళకు చెందిన కొందరు బ్రోకర్లు అక్రమంగా విదేశాలకు పంపిస్తున్నట్టు గుర్తించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ బోటులో ఉన్నవాళ్లు సురక్షితంగా ఉన్నారా లేక ఏదైనా ప్రమాదానికి గురయ్యారా అనేది సందేహాస్పదంగా మారింది. దీనిపై ఇంతవరకు చిన్న క్లూ కూడా లభించకపోవడం బాధితుల కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, దీనిపై కేరళ హైకోర్టు కూడా స్పందిస్తూ, ఇది తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదని, దేశభద్రతకు సంబంధించిన విషయం అని వ్యాఖ్యానించింది. అటు, భారత ఇంటర్ పోల్ కార్యాలయం కూడా బ్లూకార్నర్ నోటీసులు జారీచేసింది.





Untitled Document
Advertisements