తెలంగాణాలో అమెజాన్ డెలివరీ కేంద్రం

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 01:11 PM

డెలివరీ సేవలను మెరుగుపర్చేందుకు గాను ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ తెలంగాణలో అతిపెద్ద డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించింది. గచ్చిబౌలిలో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఒక్క గచ్చిబౌలి ప్రాంతంలోనే కాకుండా రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లోనూ డెలివరీ సేవలను వేగవంతం చేస్తామని కంపెనీ తెలిపింది. తెలంగాణలో అమేజాన్ నిర్వహిస్తున్న 90 డెలివరీ కేంద్రాల్లో 12 సెంటర్లు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. తెలంగాణ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ డెలివరీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ, హైదరాబాద్‌లోని లాజిస్టిక్స్‌లో అనేక ఇకామర్స్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని అన్నారు.

లాజిస్టిక్స్ సెక్టార్‌కు తమ రాష్ట్రం ప్రాంతాలు, విధానాల పరంగా అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. స్టార్టప్‌లు, పెద్ద సంస్థలు రెండు రకాల కంపెనీల సంఖ్య పెరుగుతోందని అన్నారు. తెలంగాణలో యువత మెరుగైన భవిష్యత్ కోసం, ఉపాధి అవకాశాలను కల్పించడంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తామని అన్నారు. అమెజాన్ ఇండియా లాస్ట్ మిలె ట్రాన్స్‌పోర్టేషన్ డైరెక్టర్ ప్రకాశ్ రోచ్లాని మాట్లాడుతూ, తమకు తెలంగాణ పెద్ద మార్కెట్, 3.2 మిలియన్ క్యూబిక్ అడుగుల ఉత్పత్తి నిల్వ ప్రదేశంతో మూడు ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను కల్గి ఉండడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. పటాన్‌చెరులో అతిపెద్ద అసార్ట్‌మెంట్ కేంద్రాన్ని కల్గి ఉన్నామని, అమేజాన్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలోని 500 పిన్‌కోడ్‌లకు సేవలందిస్తామని ఆయన తెలిపారు.





Untitled Document
Advertisements