కోమాలోనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి !

     Written by : smtv Desk | Thu, Jul 11, 2019, 08:58 PM

కోమాలోనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి !

అమెరికాలో ఓ ఘోర సంఘటన చోటుచేసుకుంది. పదేళ్లుగా కోమాలో ఉన్న ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడం సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పూర్తి వివరాల ప్రకారం...అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో గల ఫినిక్స్‌ నగరంలో పదేళ్ల కిందట ఓ ప్రమాదంలో గాయపడిన బాధితురాలు కోమాలోకి జారుకుంది. ఆమెను ఫినిక్స్‌లోని హసిండా హెల్త్ ‌కేర్‌లో చేర్చారు. అప్పటి నుంచి ఆమెలో ఎలాంటి కదలిక లేదు. అయితే, డిసెంబరు 29న ఆమె బాధతో మూలగడం ప్రారంభించింది. అకస్మాత్తుగా ఆమెలో కదలిక రావడంతో కోమా నుంచి కోలుకుందని వైద్యులు భావించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. స్కానింగ్ రిపోర్టులు చూసి షాకయ్యారు. ఆమె పురిటి నొప్పులతో బాధపడుతున్నట్లు గుర్తించి వెంటనే వైద్యం అందించారు. ఈ సందర్భంగా ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాడని, ఆమెకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. పదేళ్లుగా కోమాలో ఉలుకూ, పలుకూ లేకుండా పడివున్న ఆమెపై అత్యాచారం చేసిందెవరో తెలియక ఆసుపత్రి యాజమాన్యం జుట్టు పీక్కుంటున్నారు. ఆసుపత్రిలో ఉండే మహిళా పేషెంట్ల బాధ్యతలను మహిళా నర్సులు మాత్రమే చూసుకుంటారు. ఒక వేళ పురుషులు వెళ్లాలంటే.. వారి వెంటనే మహిళా నర్సు తప్పకుండా వెళ్లాలి. ఇన్ని నిబంధనలు అమలు ఉండగా ఆమెపై ఎవరు లైంగిక దాడికి పాల్పడ్డారో తెలియక ఈ కేసు మిస్టరీగా మారింది. కోమాలో ఉన్న ఆమెపై ఆసుపత్రిలోని పురుష సిబ్బందే అత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈమేరకు కోర్టు నుంచి అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

Untitled Document
Advertisements