చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా

     Written by : smtv Desk | Mon, Jul 15, 2019, 09:03 AM

భారత్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈరోజు తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్-2ను అంతరిక్షంలోకి పంపించవలసి ఉండగా, సుమారు గంట ముందు విమానవాహక నౌక జిఎస్ఎల్వీ మార్క్-3లో సాంకేతిక సమస్య ఉన్నట్లు గుర్తించడంతో ముందు జాగ్రత్త చర్యగా చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిలిపివేశారు. ఒకవేళ ప్రయోగించి ఉండి ఉంటే ఈ మిషన్‌పై పెట్టిన సుమారు 900 కోట్లు వృధా అయిపోయుండేవి. జిఎస్ఎల్వీ మార్క్-3లో సాంకేతిక సమస్యను సరిచేసిన తరువాత మళ్ళీ తదుపరి ప్రయోగం తేదీని ప్రకటిస్తామని ఇస్రో ప్రకటించింది.

అంతరిక్ష ప్రయోగాలు చేసేందుకు అత్యంత అనుకూలైన నిర్ధిష్ట సమయాలు కొన్నే ఉంటాయి. వాటినే లాంచ్ విండో అంటారు. అటువంటి లాంచ్ విండో ఈరోజు తెల్లవారుజామున సుమారు 10 నిమిషాలు ఉంది. అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు ఈ సమయాన్ని ఎంచుకున్నారు. మళ్ళీ ఈనెలలో మరో లాంచ్ విండో ఉంది కానీ దానికి కేవలం ఒక్క నిమిషం మాత్రమే వ్యవది ఉంది. కనుక ఒకవేళ ఇస్రో దానికి మొగ్గు చూపకపోతే ఇక ఈనెలలో చంద్రయాన్-2 ప్రయోగం లేనట్లే భావించవచ్చు.

చంద్రయాన్-2 ప్రయోగాన్ని చూసేందుకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా శ్రీహరికోటకు వచ్చారు. చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషలలో నిలిపివేయడంతో దాని కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న యావత్ భారతీయులు నిరాశ చెందారు. భారత్‌తో పాటు యావత్ ప్రపంచదేశాలు కూడా ఈ ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. అయితే ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ విఫలం కావడం కంటే అటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించినప్పుడు వాయిదావేసుకోవడం చాలా మంచి నిర్ణయమని చెప్పవచ్చు.





Untitled Document
Advertisements