అతడు నాకంటే బాగా తెలుగు మాట్లాడుతున్నాడు

     Written by : smtv Desk | Mon, Jul 15, 2019, 09:45 AM

హైదరాబాద్‌: ఇస్సాక్ రిచర్డ్ అనే అమెరికన్ చకచకా తెలుగు మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో మనవాళ్లేమో ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే.. తెలుగులో మాట్లాడండి అంటూ అతడు చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ వీడియోకు ఎక్కువ వ్యూస్‌ లభించాయి. తాజాగా, ఆ వీడియోకు లభిస్తున్న ఆదరణను తెలుసుకున్న ఐసాక్‌ స్పందిస్తూ ఓ వీడియోను పోస్టు చేశాడు.

‘అందరూ నన్ను న్యూజిలాండ్ వ్యక్తినని అనుకుంటున్నారు, కానీ నేను అమెరికనన్‌ని. 2016-18 మధ్య రెండేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. ఏడాది వైజాగ్‌లో, మరో ఏడాది విజయవాడలో ఉన్నాను. అప్పుడే తెలుగు నేర్చుకున్నాను. అమెరికాలో ఓ ఐస్‌క్రీమ్ పార్లర్లో పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చే తెలుగు టూరిస్టులతో నేను తెలుగులోనూ మాట్లాడతా. ఓ రోజు తెలుగులో మాట్లాడుతుంటే అమ్మాయి వీడియో తీసింది. నేను తెలుగు మాట్లాడటం గొప్ప విషయమా?. నా వీడియో ఎందుకు తీస్తున్నారని మొదట అనుకున్నాను. కానీ దానికి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయాను. నాకు తెలుగంటే చాలా ఇష్టం. నా గుండె ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండిపోయింది. త్వరలో నేను ఫేస్‌బుక్‌ ద్వారా మీతో మాట్లాడుతా. నేను ఇండియాలో ఏం చేశానో.. నా స్టోరి చెప్తాను. నేను తెలుగు ఎలా నేర్చుకున్నాను, అప్పుడు కలిగిన అనుభవాలను మీతో పంచుకుంటాను’ అని వీడియోలో ఇసాక్ రిచర్డ్ పేర్కొన్నాడు.

ఈ వీడియోను దినేష్‌ ఆకుల అనే నెటిజన్ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దీన్నీ చూసిన మంచు లక్ష్మి స్పందించారు. ‘అతడు నాకంటే బాగా తెలుగు మాట్లాడుతున్నాడు (స్మైలింగ్ ఎమోజీ). మన భాషను విదేశీయులు ఇష్టపడటం చాలా సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌ చేసింది.





Untitled Document
Advertisements