'కబీర్‌సింగ్‌' పై విజయ్ దేవరకొండ కామెంట్ కొత్తగా ఉంది

     Written by : smtv Desk | Mon, Jul 15, 2019, 03:19 PM

'కబీర్‌సింగ్‌' పై విజయ్ దేవరకొండ కామెంట్ కొత్తగా ఉంది

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘కబీర్‌ సింగ్‌’. తెలుగులో బ్లాక్‌బస్టర్‌ హిట్ అయిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమాకు ఇది రీమేక్‌ . మాతృకను తెరకెక్కించిన సందీప్‌ రెడ్డి వంగానే ‘కబీర్ సింగ్‌’ని కూడా తెరకెక్కించారు. ‘అర్జున్‌రెడ్డి’లో చూపించిన సీన్స్ నే హిందీలోనూ చూపించారు. కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం జూన్‌ 21న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయ్యింది.

ఈ ఏడాది బాలీవుడ్‌లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రం ‘కబీర్‌ సింగ్‌’ నిలిచింది. ఇప్పటివరకూ ఈ చిత్రం రూ. 250కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే, ‘అర్జున్‌రెడ్డి’తో పోలిస్తే, ‘కబీర్‌సింగ్‌’కు ఎక్కువ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండ ఈ సినిమా చూసారా లేదా, చూస్తే ఆయన కామెంట్ ఏమిటన్నది మీడియాలో చర్చగా మారింది. అదే విషయం మీడియా వారు విజయ్ ని అడిగేసారు. ఆయన ఏమన్నారో చూద్దాం.

విజయ్‌ హీరోగా ‘డియర్‌ కామ్రేడ్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా బెంగుళూరు వెళ్లారు విజయ్ దేవరకొండ. అక్కడ మీడియాతో కలిసి మాట్లాడారు. దాంతో వాళ్లు ‘మీరు కబీర్‌సింగ్‌ చూశారా’ అని విజయ్‌ను ప్రశ్నించగా, ‘షాహిద్‌ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించి ఉంటారు. మళ్లీ ఆ సినిమా చూడటం వల్ల నాకొచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ కథ మొత్తం నాకు తెలుసు. తెలుగులో నేనే నటించా. మళ్లీ ఎందుకు చూడటం’ అని సమాధానం ఇచ్చి ఆశ్చర్య పరిచారు. సినిమా చూసాననో, చూడబోతున్నాను అనో చెప్తారు అనుకున్న మీడియావాళ్లు ఆశ్చర్యపోయారు.

అలాగే సందీప్ వంగా నా మనిషి, ఆయన తీసిన హిందీ సినిమా కూడా పెద్ద హిట్టవ్వాలని కోరుకున్నాను. కానీ అది బ్లాక్ బస్టర్ అయింది. ఇంతకంటే సంతోషం ఏముంటుంది? దానికి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏముంది?' అని విజయ్ దేవరకొండ తెలిపారు.

అయితే కొద్ది రోజుల క్రితం ఇదే విజయ్ దేవరకొండ తాను కబీర్ సింగ్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నానని, ఫ్యాన్స్ లో షూటింగ్ లో ఉండటం వల్ల చూడలేకపోయానని అన్నారు. హైదరాబాద్ వచ్చాక వైరల్ ఫీవర్ వచ్చిందని, త్వరలోనే చూస్తానని అన్నారు. నా స్నేహితుడు సందీప్ వంగా..ఈ సినిమా ఒరిజినల్ లో ఏమేం మార్పులు చేసి రీమేక్ చేసారో చూడాలని ఆసక్తిగా ఉందని అన్నారు.





Untitled Document
Advertisements