కదిలించిన కథనం... స్వయంగా సీఎం స్పందించిన వేళ!!

     Written by : smtv Desk | Wed, Jul 17, 2019, 08:28 PM

కదిలించిన కథనం... స్వయంగా సీఎం స్పందించిన వేళ!!

విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమ చిన్నారికి వచ్చిన అరుదైన వ్యాధికి చికిత్స చేయించలేక తల్లిడిల్లుతున్న వైనాన్ని ఓ వార్తా చానల్ లో చూసిన సీఎం జగన్ కదిలిపోయారు. ఎనిమిది నెలల ఆ చిన్నారి పేరు పర్ణిక. పర్ణిక పేగు సంబంధ వ్యాధితో నరకయాతన అనుభవిస్తోంది. విసర్జన పదార్థాలు వెలుపలికి రాకపోగా, రక్తస్రావం అవుతోంది. ఆసుపత్రికి వెళ్లగా వెంటనే ఆపరేషన్ నిర్వహించాలని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

ఆపరేషన్ కు రూ.5 లక్షలు ఖర్చవుతుందని తెలియడంతో వారు సీఎం సహాయనిధి నుంచి సాయం పొందాలని భావించి అమరావతి వచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద జగన్ ను కలిసేందుకు అష్టకష్టాలు పడుతుండడం ఓ మీడియా చానల్ దృష్టిలో పడింది. వెంటనే వారి కష్టాన్ని ఆ చానల్ కథనం రూపంలో ప్రసారం చేయగా, ఆ కథనాన్ని సీఎం జగన్ కూడా చూశారు. చిన్నారి పర్ణిక పడుతున్న మూగవేదన ఆయనను చలించిపోయేలా చేసింది.

వెంటనే స్పందించిన జగన్ పాప ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని, వారికి అన్నివిధాలుగా సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో వెంటనే కదిలిన అధికారులు చిన్నారి పర్ణిక తల్లిదండ్రులతో మాట్లాడి విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆ పాపకు అక్కడ మెరుగైన వైద్యం అందుతోంది. తమ పరిస్థితి పట్ల వెంటనే స్పందించిన సీఎంకు ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.





Untitled Document
Advertisements