వైసీపీ పాలనలో.... 'నీటిపారుదల' లేకపోయినా 'నోటిపారుదల' మాత్రం బాగా ఉంది!!

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 04:18 PM

వైసీపీ పాలనలో.... 'నీటిపారుదల' లేకపోయినా 'నోటిపారుదల' మాత్రం బాగా ఉంది!!

ఏపీ ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "వైసీపీ పాలన వచ్చాక రాష్ట్రంలో నీటిపారుదల లేకపోయినా సభల్లో మాత్రం వైసీపీ నేతల నోటిపారుదల ఉద్ధృతంగా ఉంది. నోరుంది కదా అని ఆరోపణలు చేయగానే సరిపోదు, రుజువులు కూడా చూపించాలి కదా. పనిచేసేందుకైనా, చర్చించేందుకైనా సబ్జెక్టుపై అవగాహన ఉండాలి. అది లేనోళ్ళు ఇలాగే పలాయనం సాగిస్తారు" అని అనిల్ కుమార్ పై విమర్శలు చేశారు.

కాగా, టీడీపీ నేతలపై ఏపీ మంత్రులు చేసిన ఆరోపణలపైనా నారా లోకేశ్ మండిపడ్డారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, ఒక మాజీ మంత్రిపై ప్రస్తుత మంత్రి ఆరోపణలు చేస్తే వాటిపై సాక్ష్యాధారాలు ఉండాలిగా అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో డబ్బులు మళ్లించానని ఆరోపణలు చేస్తున్నారని, ఆ డబ్బులేమన్నా మా అక్కా చెల్లెళ్లు, పెద్దమ్మ, చిన్నమ్మ కంపెనీలకో మళ్లించానా? అంటూ మండిపడ్డారు.

తాను పైచదువులు అమెరికాలో చదివానని, 2000 నుంచి 2008 వరకు అమెరికాలోనే ఉన్నానని, తెలుగులో మాట్లాడేటప్పుడు ఒక పదం అటూఇటూ అవ్వొచ్చు కానీ, వీళ్ల లాగా దేశాన్ని దోచుకోలేదంటూ వైసీపీ సభ్యులపై ఆయన ధ్వజమెత్తారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని, నిప్పులా బతికామని, వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని అన్నారు. అవినీతి ఆరోపణలు చేసి తప్పించుకుంటే కుదరదని, నిరూపించాలని డిమాండ్ చేశారు.వైసీపీ సభ్యులలా బూతులు మాట్లాడటం తమకు రాదని, వాస్తవాలు చెబుతుంటే నానా యాగీ చేస్తున్నారంటూ మండిపడ్డారు.





Untitled Document
Advertisements