శాస్త్రికి పోటీగా SRH కోచ్!

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 07:52 PM

శాస్త్రికి పోటీగా SRH కోచ్!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇంగ్లాండ్ జట్టుకు తొలి వరల్డ్ కప్ అందించిన ట్రేవర్ బేలిస్‌ కోచ్ గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఏడేళ్లపాటు సన్‌రైజర్స్ కోచ్‌గా వ్యవహరించిన టామ్ మూడీ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ట్రేవర్ బేలిస్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్టు సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. సన్‌రైజర్స్ టామ్ మూడీ శిక్షణలో ఐదుసార్లు ప్లే ఆఫ్స్ చేరగా.. 2016లో టైటిల్ గెలిచింది. సన్‌రైజర్స్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన.. టీమిండియా కోచ్‌గా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసినప్పటికీ.. 45 రోజులపాటు పొడిగించింది. సౌతాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటన ప్రారంభించే సమయానికి కొత్త కోచ్‌తోపాటు ఇతర స్టాఫ్ వచ్చేస్తారు. ఇప్పుడున్న కోచ్‌ రవిశాస్త్రి కూడా మరోసారి కోచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. కానీ వరల్డ్ కప్ ఫైనల్ చేరలేకపోవడం, రోహిత్‌తో విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తోన్న నేపథ్యంలో కోచ్ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. క్రితంసారి కోచ్‌ను ఎంపిక చేసినప్పుడు టామ్ మూడీ గట్టిపోటీనిచ్చాడు. శ్రీలంక క్రికెట్ జట్టుకు కోచ్‌గా పని చేయడంతోపాటు ఐపీఎల్ తొలి సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగపూర్ రైడర్స్ జట్టుకు 2017 నుంచి కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లతో కలిసి పని చేయడంతోపాటు.. చక్కటి కోచింగ్ స్కిల్స్ ఆయన సొంతం. దీంతో బీసీసీఐ ఆయన వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. టామ్ మూడీతోపాటు.. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్దనే కూడా కోచ్ పదవి కోసం ప్రధానంగా పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది.





Untitled Document
Advertisements