ఇండియాకు చేరుకున్న విరాట్, పాండ్యా

     Written by : smtv Desk | Thu, Jul 18, 2019, 08:46 PM

ఇండియాకు చేరుకున్న విరాట్, పాండ్యా

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా భారత్‌‌లో గురువారం అడుగుపెట్టారు. ప్రపంచకప్‌లో టీమిండియా వారం క్రితమే సెమీస్‌లో ఓడిపోగా.. స్వదేశానికి వచ్చేందుకు ఆటగాళ్లకి టికెట్లను ఏర్పాటు చేయడంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విఫలమైంది. దీంతో.. టీమ్‌తో కలిసి ఇంగ్లాండ్‌లోనే ఉన్న విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్య తాజాగా ముంబయికి చేరుకున్నారు. ప్రపంచకప్‌ని చూసేందుకు ఇంగ్లాండ్‌కి వెళ్లిన అనుష్క శర్మ‌ కూడా విరాట్ కోహ్లీతో పాటు ఈరోజు స్వదేశానికి వచ్చింది. ఈ జంట ముంబయి విమానాశ్రయం నుంచి వెలుపలికి వచ్చి కారులో వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోహ్లీతో పాటు హార్దిక్ కూడా ముంబయి‌లోనే దిగాడు. మూడు రోజుల క్రితమే ఓపెనర్ రోహిత్ శర్మ తన భార్య రితిక, కూతురు సమైరాతో కలిసి భారత్‌కి వచ్చేసిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ లీగ్ దశలో 8 మ్యాచ్‌లాడి ఏకంగా ఏడింట్లో గెలుపొందిన భారత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ.. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో అనూహ్యంగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లాండ్ టీమ్.. తొలిసారి ప్రపంచకప్‌ని ముద్దాడిన విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements