సినీ నటుడు రజనీకాంత్‌ను విచారించాలి!!

     Written by : smtv Desk | Fri, Jul 19, 2019, 11:22 AM

సినీ నటుడు రజనీకాంత్‌ను విచారించాలి!!

తూత్తుకుడి స్టెరిలైట్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తమిళనాడులో అప్పట్లో జరిగిన ఆందోళన దేశం దృష్టిని ఆకర్షించింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తమిళ సినీ నటుడు రజనీకాంత్ అప్పట్లో పరామర్శించారు. స్టెరిలైట్ ఆందోళనలో సంఘవిద్రోహులు చొరబడ్డాయని ఆరోపించారు.

తూత్తుకుడి కాల్పుల ఘటనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన రజనీకాంత్‌ను విచారించాలంటూ తాజాగా తిరునల్వేలికి చెందిన లాయర్, మానవ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు వాంజినాథన్ డిమాండ్ చేశారు. కాగా, తూత్తుకుడి కాల్పుల ఘటనపై విచారణ కోసం నియమించిన న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ మంగళవారం 13వ విడత విచారణను ప్రారంభించింది.

విచారణకు హాజరైన వాంజినాథన్ తన వాదనలు వినిపించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తూత్తుకుడి కాల్పుల వెనక పోలీసు ఉన్నతాధికారులు, స్టెరిలైట్ సంస్థ ఉన్నాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కమిషన్‌కు సమర్పించినట్టు తెలిపారు. కాల్పుల ఘటనలో రజనీకాంత్‌కు సమన్లు పంపి విచారించాలని డిమాండ్ చేశారు. అలాగే పోలీసు అధికారులతోపాటు వేదాంత సంస్థపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

Untitled Document
Advertisements