ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌: సింధు క్వార్టర్ ఫైనల్‌కు...శ్రీకాంత్ ఇంటికి!

     Written by : smtv Desk | Fri, Jul 19, 2019, 12:21 PM

ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌: సింధు క్వార్టర్ ఫైనల్‌కు...శ్రీకాంత్ ఇంటికి!

ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ పురుషుల సింగిల్స్‌లో స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. మహిళల సింగిల్స్‌లో సింధు అద్భుత ఆటతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. గురువారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింధు 2114, 1721, 2111 తేడాతో డెన్మార్క్ షట్లర్ మియా బ్లెచ్‌ఫెల్డ్‌ట్‌ను ఓడించింది. ఆరంభ సెట్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సింధు జోరుకు మియా ఎదురు నిలువలేక పోయింది. తన మార్క్ ఆటతో చెలరేగిన సింధు అలవోకగా సెట్‌ను గెలుచుకుంది. కానీ, రెండో సెట్‌లో ఫలితం మారి పోయింది. ఈసారి సింధుకు ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. దూకుడుగా ఆడిన మియా పైచేయి సాధించింది. సింధును హడలెత్తిస్తూ ముందుకు సాగింది. ఇది క్రమంలో అలవోకగా సెట్‌ను గెలుచుకుంది. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మళ్లీ సింధు పుంజుకుంది. అద్భుత ఆటతో ప్రత్యర్థిని హడలెత్తించింది. దూకుడును ప్రదర్శిస్తూ లక్షం వైపు అడుగులు వేసింది. ఇదే క్రమంలో సునాయాసంగా సెట్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్ స్టార్ నజోమి ఒసాకాతో సింధు తలపడుతుంది. మరోవైపు భారత అగ్రశ్రేణి ఆటగాడు శ్రీకాంత్ రెండో రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. హాంకాంగ్ ఆటగాడు లాంగ్ అంగస్‌తో జరిగిన పోరులో కంగుతిన్నాడు. హోరాహోరీ సమరంలో అంగస్ 2117, 2119తో ప్రపంచ నంబర్9 ఆటగాడు శ్రీకాంత్‌ను ఓడించాడు. ప్రారంభం నుంచే ఇద్దరు దూకుడును ప్రదర్శించారు. దీంతో మ్యాచ్ ఆసక్తిగా సాగింది. ఇద్దరు పోటీ పడి ఆడడంతో ఫలితం తరచు చేతులు మారుతూ వచ్చింది. కానీ, కీలక సమయంలో శ్రీకాంత్ ఒత్తిడికి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో శ్రీకాంత్ విఫలమయ్యాడు. దీంతో అంగస్ తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్ కూడా నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇందులో కూడా పోరు ఆసక్తి రేకెత్తించింది. కానీ, ఈసారి కూడా శ్రీకాంత్ ఒత్తిడిని తట్టుకోలేక పోయాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న అంగస్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేశాడు.





Untitled Document
Advertisements