వరుస భూప్రకంపనలు... హడలిపోతున్న జనం!!

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 02:17 PM

వరుస భూప్రకంపనలు... హడలిపోతున్న జనం!!

వరుసగా భూమి కంపిస్తుండడంతో ఎప్పుడు ప్రాణం మీదికి వస్తుందో అని అరుణాచల్‌ప్రదేశ్‌ వాసులు భీతిల్లుతున్నారు. గడచిన 14 గంటల వ్యవధిలో రాష్ట్ర పరిధిలో భూమి నాలుగుసార్లు కంపించింది. నిన్న మూడుసార్లు కంపించిన భూమి, ఈరోజు తెల్లవారు జామున ఒకసారి కంపించడంతో కంటిమీద కునుకులేకుండా నివాసితులు గడుపుతున్నారు. నిన్న మధ్యాహ్నం 2.52 గంటల సమయంలో రాష్ట్రంలోని ఈస్ట్‌కామేంగ్‌ ప్రాంతంలో తొలిసారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైంది.

మధ్యాహ్నం 3.04 గంటల సమయంలో ఇదే జిల్లాలో మరోసారి (3.8 తీవ్రత), 3.21 గంటల సమయంలో మూడోసారి కురుంగ్‌ కుమేయ్‌ జిల్లాలో (4.9 తీవ్రత) మరోసారి భూమి కంపించింది. కేవలం అరగంట వ్యవధిలో మూడుసార్లు భూమి తీవ్రంగా కంపించడంతో నివాసిత ప్రాంతాల వారి పైప్రాణాలు పైనే పోయాయి. ఆ తర్వాత చాలాసేపటి వరకు ఎటువంటి అలజడి లేకపోవడంతో భూమి శాంతించిందని జనం ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈరోజు తెల్లవారు జామున 4.24 గంటల సమయంలో తొలిసారి భూమి కంపించిన ఈస్ట్‌కామేంగ్‌ జిల్లాలోనే మరోసారి ప్రకంపనలు రావడంతో జనం హడలిపోయారు. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేకున్నా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో జనం వణికిపోతున్నారు.





Untitled Document
Advertisements