ఇరాన్ స్వాధీనం చేసుకున్న నౌకలో 18 మంది భారతీయులు

     Written by : smtv Desk | Sat, Jul 20, 2019, 04:32 PM

ఇరాన్ స్వాధీనం చేసుకున్న నౌకలో 18 మంది భారతీయులు

ఇరాన్ తాజాగా స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ చమురు ట్యాంకర్ నౌకలో 18 మంది భారతీయులు ఉన్నారని తాజాగా ఆ దేశ వార్తా సంస్థ ప్రకటించింది. వారితో పాటు మొత్తం 23 మంది సిబ్బంది ఉన్నారని, హార్మజ్ జలసంధిలో స్వాధీనం చేసుకున్న నౌకను ఇరాన్ బందర్ అబ్బాస్ నౌకాశ్రయానికి తరలించినట్లు తెలిపింది. స్టెనా ఇంపెరో పేరుతో ఉన్న ఈ నౌక ఇరాన్ జాతీయులకు చెందిన చేపల పడవను ఢీకొనడం కారణంగానే దీన్ని స్వాధీనం చేసుకుని ప్రశ్నించడానికి నౌకాశ్రయానికి తరలించినట్లు అధికారులను ఉటంకిస్తూ వార్తాసంస్థ వెల్లడించింది. దర్యాప్తు పూర్తయ్యేవరకు నౌకలోని 23 మంది సిబ్బంది అందులోనే ఉంటారని, ఈ నౌకలో 18 మంది భారతీయులు, ఐదుగురు ఇతర జాతీయులు ఉన్నారని ఒక అధికారి తెలిపారు.కాగా, ఇరాన్ స్వాధీనం చేసుకున్న నౌకను దౌత్యపరమైన చర్యల ద్వారా విడిపించుకుంటామని బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి జెరెమీ హంట్ తెలిపారు. ఈ నౌక సౌదీ అరేబియాలోని ఒక పోర్ట్‌కు వెళుతుండగా హఠాత్తుగా దిశమార్చుకుంది. జులై 4న ఇరాన్‌కు చెందిన గ్రేస్ 1 చమురు ట్యాంకర్ నౌకను బ్రిటిష్ నౌకాదళం గిబ్రాల్టర్‌లో స్వాధీనం చేసుకోవడంతో ఇరాన్, బ్రిటన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. యూరోపియన్ యూనియన్ ఆంక్షలను ఉల్లంఘిస్తూ సిరియాకు ఇరాన్ చమురును స్మగ్లింగ్ చేస్తోందన్న ఆరోపణపై చమురు ట్యాంకర్‌ను బ్రిటిష్ నేవీ స్వాధీనం చేసుకుంది.





Untitled Document
Advertisements