ఇండియా చైనా సంబంధాలు మరింత బలోపేతం ...

     Written by : smtv Desk | Tue, Aug 13, 2019, 09:15 PM

బీజింగ్​: రెండు దేశాల మధ్య సంబంధాల్ని మరింతగా మెరుగుపర్చుకోవాలని ఇండియా, చైనా నిర్ణయించుకున్నాయి. కీలక అంశాల పట్ల పరస్పర సున్నితత్వమే రెండు దేశాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని, ద్వైపాక్షికంగా తలెత్తే ఎలాంటి విభేదాలైనా వివాదాలుగా మారకుండా జాగ్రత్తపడాలని విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్​ అన్నారు. మంత్రి హోదాలో తొలిసారి చైనాలో పర్యటిస్తున్న ఆయన సోమవారం చైనా ఉపాధ్యక్షుడు వాంగ్‌ ఖిషాన్‌, విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో చర్చలు జరిపారు. వాణిజ్యం చాలా వరకు ఏకపక్షంగా నడుస్తుండటంపై ఇండియా ఆందోళన వ్యక్తం చేయగా, ఇకపై సంబంధాల్ని సమతూకంలో నెరుపుదామని, అందుకోసం ఇండస్ట్రియల్​ ప్రొడక్షన్​, టూరిజం, బోర్డర్​ ట్రేడింగ్​లోనూ బంధాలన్ని విస్తరించుకుందామని చైనా హామీ ఇచ్చింది.

ఈ సందర్భంగా రెండు దేశాలకు మేలు చేసే నాలుగు ఒప్పందాలపై జైశంకర్​, వాంగ్​యీ సంతకాలు చేశారు. చైనా ప్రెసిడెంట్​ జిన్​పింగ్​ఈ ఏడాది అక్టోబర్​లో వారణాసిని సందర్శించే అవకాశాలున్నట్లు రెండు దేశాల ప్రతినిధితులు తెలిపారు. జమ్మూకాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్ రద్దు, రాష్ట్ర విభజన తర్వాత అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాల దృష్ట్యా విదేశాంగ మంత్రి చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. లడఖ్​​ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంపై అభ్యంతర వ్యక్తం చేసిన చైనాకు ‘జమ్మూకాశ్మీర్​ పూర్తిగా ఇండియా అంతర్గత వ్యవహారం’అని జైశంకర్​ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ‘‘బోర్డర్ పంచుకోవడమేకాక, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఇండియా, చైనా మధ్య సమస్యలు తలెత్తడం సహజమని, వాటిని పరిష్కరించుకోవడం కూడా చాలా అవసరమని, విభేదాలు వివాదాలుగా మారొద్దని రెండు దేశాల అధినేతలు(మోడీ, జిన్​పింగ్​) గతంలోనే నిర్ణయించారని, ఆ దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని జైశంకర్​ అన్నారు. జమ్మూకాశ్మీర్​ పరిణామాల్ని చైనా దగ్గరగా పరిశీలిస్తున్నదని, పాక్​తో శాంతి నెలకొనేలా ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యూ ఆశాభావం వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements