ప్రజలు పిచ్చోళ్ల సంవర్గంలో విహరించొద్దు.. వివేకంతో ఆలోచించాలి

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 11:31 AM

ప్రజలు పిచ్చోళ్ల సంవర్గంలో విహరించొద్దు.. వివేకంతో ఆలోచించాలి

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమద్ ఖురేషీ తమ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పాక్ ప్రజలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు కశ్మీర్‌లో భారత్‌పై పాక్ చేయబోయే ఫిర్యాదును స్వీకరించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో మీడియాతో ఖురేషీ మాట్లాడుతూ...కశ్మీర్ అంశాన్ని ఉపయోగించుకొని భావోద్వేగాలను రెచ్చగొట్టడం, అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా సులభం. అయితే ఈ విషయంలో ముందుకు సాగడం చాలా కష్టం. వారు(ఐరాస)మనకు స్వాగతం పలకడానికి పూల మాలలతో సిద్ధంగా లేరు. శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా మనకు అడ్డుపడవచ్చు. ప్రజలు పిచ్చోళ్ల సంవర్గంలో విహరించొద్దు.. వివేకంతో ఆలోచించాలి’ అని అన్నారు. అంతేకాదు, ఉమ్మా (ముస్లింల) పరిరక్షకులు కూడా తమ ఆర్థిక ప్రయోజనాల దృష్టా ఈ విషయంలో పాక్‌కు మద్ద తు ఇవ్వకపోవచ్చంటూ పరోక్షంగా అరబ్ దేశాలనుద్దేశించి అన్నారు. కశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయానికి రష్యా మద్దతు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఖురేషీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత వారం చైనాలో పర్యటించిన ఖురేషీ కశ్మీర్ విషయంలో చైనా పాక్‌కు మద్దతుగా నిలవనుందని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కశ్మీర్ నిర్ణయం పూర్తిగా భారత అంతర్గత విషయమని స్పష్టం చేశారు. 370 అధికరణ రద్దు, కశ్మీర్ విభజన నిర్ణయాలను పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌పై ఏకపక్ష నిర్ణయం సరికాదంటూ ఈ విషయాలను వివాదాలు చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంది. అయితే అంతర్జాతీయ సమాజంనుంచి మద్దతు కొరవడడంతో ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉంది.





Untitled Document
Advertisements