మరో వారం రోజుల్లో చంద్రుడి కక్ష్యలోకి

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 12:11 PM

మరో వారం రోజుల్లో చంద్రుడి కక్ష్యలోకి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 వ్యోమనౌక మరో వారం రోజుల్లో చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. బుధవారం తెల్లవారుజామున చేపట్టిన కీలకమైన ప్రక్రియ ద్వారా వ్యోమనౌక పూర్తి స్థాయిలో భూ కక్ష్యను విడిచిపెట్టింది. ప్రయోగం చేపట్టిన 23 రోజుల తర్వాత చంద్రయాన్-2 కీలకమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది. మరో ఆరురోజుల పయనం తర్వాత ఆగస్టు 20న వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. గత నెల 22న శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ప్రయోగించిన 3850 కిలోల బరువుండే చంద్రయాన్-2 వ్యోమనౌకలో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ ఉన్నాయి. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించే వ్యోమ నౌక సెప్టెంబర్ 7వ తేదీన జాబిల్లి ఉపరితలంపై కాలుమోపనుంది. కీలకమైన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంతో ఇస్రో సిబ్బంది సంతోషంలో మునిగిపోయారు. చంద్రయాన్-2 వ్యోమనౌక సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువం సమీపంలో ల్యాండ్ కానుందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ తెలిపారు. భారత అంతరిక్ష పితామహుడు, ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్‌ సారాభాయ్‌ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన చంద్రయాన్-2 విశేషాలను పంచుకున్నారు. చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత ఐదుసార్లు కక్ష్య పెంచామని, కీలకమైన ప్రక్రియను బుధవారం చేపడతామని శివన్ తెలిపారు. దీని ద్వారా వ్యోమనౌక పూర్తిగా భూకక్ష్యను వదలి చంద్రుడి వైపు పయనిస్తుందన్నారు ఆ తర్వాత లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ చేపట్టడం ద్వారా చంద్రయాన్-2 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందన్నారు. మరికొన్ని ప్రక్రియలు చేపట్టిన తర్వాత సెప్టెంబర్ 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువానికి సమీపంలో వ్యోమనౌక ల్యాండ్ అవుతుందని శివన్ తెలిపారు.





Untitled Document
Advertisements