తెలుగు టైటాన్స్ ప్లేఆఫ్‌కి చేరేనా?

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 03:04 PM

తెలుగు టైటాన్స్ ప్లేఆఫ్‌కి చేరేనా?

సీజన్ 7లో జైపూర్ పింక్ పాంథర్స్ తప్ప మిగిలిన 11 జట్లూ కనీసం ఆరు మ్యాచ్‌లు ఆడేశాయి. కాని భారీ అంచనాల మధ్య సీజన్‌లోకి అడుగుపెట్టిన తెలుగు టైటాన్స్ 8 మ్యాచ్‌ల్ని పూర్తి చేసుకోగా.. ఒక మ్యాచ్‌లో గెలిచి, ఐదింట్లో ఓడి, రెండింటిని టైగా ముగించింది. దీంతో.. పాయింట్ల పట్టికలో టైటాన్స్ 13 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్‌కి అర్హత సాధించాలంటే టోర్నీ లీగ్‌ దశ ముగిసే సమయానికి టాప్-6లో తెలుగు టైటాన్స్‌ చోటు దక్కించుకోవాలి. తెలుగు టైటాన్స్‌కి గత కొన్ని సీజన్లుగా ప్రతిరూపంలా నిలిచిన స్టార్ రైడర్ రాహుల్ చౌదరి ఈసారి తమిళ్ తలైవాస్‌కి మారిపోయాడు. దీంతో.. ఆరంభం నుంచి తెలుగు టైటాన్స్‌ ప్రయాణం తడబడుతూనే సాగుతోంది. గత సీజన్‌లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ రైడర్ సిద్ధార్థ దేశాయ్ ఈసారి తెలుగు టైటాన్స్‌ టీమ్‌లోకి వచ్చినా.. రాహుల్ చౌదరి తరహాలో అతను దూకుడుగా ఆడి జట్టులో ఉత్సాహం నింపలేకపోతున్నాడు. దీంతో.. డిఫెండర్లు కూడా ఒత్తిడిలో కనిపిస్తున్నారు. మొత్తంగా.. తెలుగు టైటాన్స్‌ ఈసారి ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే చెమటోడ్చక తప్పేలా లేదు. సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ ఎంతలా వెనకబడిందో చెప్పడానికి జట్టు సాధించిన ఒక్క గెలుపే నిదర్శనం. టీమ్‌లో మొత్తం 12 జట్లు పోటీపడుతుండగా.. అన్ని జట్లూ కనీసం రెండు విజయాల్ని ఖాతాలో వేసుకోగా.. తెలుగు టైటాన్స్‌ మాత్రం గెలిచింది ఒక్క మ్యాచ్‌లోనే. అది కూడా ఏడో మ్యాచ్‌లో. మరోవైపు దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్ ఇప్పటికే 20 పాయింట్లను ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్ రేసులో ముందు వరుసలో ఉన్నాయి. దీంతో.. తెలుగు టైటాన్స్‌ టోర్నీ ఇకనైనా పుంజుకుని రాణిస్తేనే..? ప్లేఆఫ్ ఆశలు నిలవనున్నాయి.





Untitled Document
Advertisements