వ్యాయామం చేయట్లేదా...అయితే వేడినీళ్ళు ఉన్నాయిగా!

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 04:11 PM

వ్యాయామం చేయట్లేదా...అయితే వేడినీళ్ళు ఉన్నాయిగా!

వేడినీటితో స్నానం చేయడం వల్ల అనేక లాభాలున్నాయి. వ్యాయామం చేయని వారు రోజూ వేడినీటి స్నానం చేస్తే కొంతమేర వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో వేడి పుడుతుంది.. అలాగే వేడినీటి స్నానంతోనూ అదే ప్రక్రియ జరుగుతుందని తేల్చారు. ఇందుకోసం 2,300 మంది మధ్య వయసు వ్యక్తులను దాదాపు 20 ఏళ్లపాటు పరిశీలించారు. వీరిలో వారానికి ఒకసారి ఆవిరి స్నానం చేసినవారు 20 ఏళ్ల కాలంలో సగం మంది మృతి చెందారు. వారంలో రెండు నుంచి మూడుసార్లు ఆవిరి స్నానం చేసినవారిలో 38 శాతం మంది మాత్రమే అదే కాలవ్యవధిలో మృతి చెందారు. ఎక్కువ సార్లు ఆవిరి స్నానం చేసే వారిలో గుండెపోటు, ఇతర గుండె సమస్యల ముప్పు తగ్గుతున్నట్లు ఈ పరిశోధనలో గుర్తించారు. ఆవిరి స్నానంతో రక్త సరఫరా పెరగడం, రక్తపోటు తగ్గడం వలనే ఈ ఫలితాలు కలుగుతున్నట్లు వారు చెబుతున్నారు. వేడినీటి స్నానం ఫలితాలపై ఫాల్కనర్‌ మరో పరిశోధన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న అభ్యర్థులకు రక్తంలో చక్కెర స్థాయి, శరీర అంతర్భాగంలో ఉష్ణోగ్రతలను నిరంతరం కొలిచేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. అధ్యయనం మొదటి దశలో అభ్యర్థులు 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉన్న వేడి నీటిలో గంట సమయం స్నానం చేశారు. తర్వాతి దశలో వీరందరితో గంటపాటు సైకిల్‌ తొక్కే వ్యాయామం చేయించారు. ఈ రెండు సందర్భాల్లో వారి శరీరాల్లో కలిగిన మార్పులను లెక్కించారు. వేడినీటి స్నానం చేయడం ద్వారా.. వారిలో 140 క్యాలరీలు కరిగినట్లు గుర్తించారు. ఇది 30 నిమిషాల వేగమైన నడకతో (బ్రిస్క్‌ వాక్‌) సమానం. గంట సైకిల్‌ తొక్కడం ద్వారా వారిలో సరాసరిన 630 క్యాలరీలు కరిగాయి. వేడినీటి స్నానం సైకిలింగ్‌ వ్యాయామంతో సమానం కాకపోయినా.. పెద్దమొత్తంలో క్యాలరీలను కరిగినట్లు అధ్యయనంలో తేలింది.





Untitled Document
Advertisements