త్వరలోనే వన్ నేషన్ - వన్ పోల్

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 09:32 AM

త్వరలోనే వన్ నేషన్ - వన్ పోల్ సాకారం చేస్తామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ... 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 రోజుల్లోనే దేశం కోసం, ప్రజలకు కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ స్వాతంత్ర్యం అని.. స్వాతంత్ర్యం అనంతరం శాంతి, సమృద్ధి, భద్రతకు అందరూ కృషి చేశారని కొనియాడారు. అమరవీరుల త్యాగాలను దేశ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని.. ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో తమకు అవకాశం ఇచ్చారని, వారు ఆశించిన మేరకు సుపరిపాలన అందిస్తామని ప్రకటించారు ప్రధాని మోడీ.
గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే తమ దేశ ప్రజల ఆకాంక్షల మేరకు చట్టాల్లో కీలక మార్పులు చేశామని చెప్పుకొచ్చారు ప్రధాని.. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని.. అందులో భాగంగానే ఆర్టికల్‌ 370,35ఏ రద్దు చేశామని.. దీంతో.. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కలలను సాకారం చేశామన్నారు. ఇక, గత ప్రభుత్వాలు ఆర్టికల్ 370పై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. విమర్శలు చేసినా.. ఆరోపణలు గుప్పించినా.. దేశ భవిష్యత్తే నాకు ముఖ్యమని స్పష్టం చేశారు ప్రధాని. "ఒకే దేశం-ఒకే రాజ్యాంగం" సాధ్యమైంది.. త్వరలో "వన్ నేషన్-వన్ పోల్" సాకారమవుతుందని ప్రకటించారు. మరోవైపు ముస్లిం మహిళల రక్షణ కోసం చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు ప్రధాని మోడీ... ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల్లో సాధికారత పెంచామన్నారు. ఇక, జనాభా విస్ఫోటనం ఆందోళన కలిగించే విషయమన్న ప్రధాని.. జనాభా నియంత్రణతోనే దేశఅభివృద్ధి సాధ్యమన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రతీ ఒక్కరికీ ఇల్లు ఉండేలా చేయడమే తమ లక్ష్యంగా తెలిపారు. గ్లోబల్ మార్కెట్‌ను ఒడిసిపట్టుకున్నాం.. ప్రతి జిల్లా ఎగుమతి కేంద్రంగా తయారు కావాలన్నారు.





Untitled Document
Advertisements