24 ఏళ్ల క్రితం కలిసిన వ్యక్తిని మళ్ళీ కలిసేలా చేసిన ట్విట్టర్

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 01:07 PM

24 ఏళ్ల క్రితం కలిసిన వ్యక్తిని మళ్ళీ కలిసేలా చేసిన ట్విట్టర్

24 ఏళ్ల క్రితం తనకు సైకిల్‌ని బహుమతిగా ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాలని భావించిన ఓ యువతికి ఇంటర్‌నెట్ సాయపడింది. కనీసం పేరు కూడా తెలియని ఆ వ్యక్తిని ప్రత్యక్షంగా కలిసేలా చేసింది. తన దగ్గరున్న వ్యక్తి ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా స్పందనలు మిన్నంటాయి. అంతే రెండు రోజుల్లోనే ఆమెకు ఆ వ్యక్తి వివరాలు లభించాయి. ఇక కథలోకి వెళితే మొదటి గల్ఫ్ యుద్ధ కాలం1990వ దశకంలో మెవన్ బాబాకర్ అనే బాలిక ఇరాక్ నుంచి పారిపోయి వచ్చిన తన కుటుంబంతో కలసి నెదర్లాండ్స్‌లోని ఒక శరణార్థ శిబిరంలో ఆశ్రయం పొందింది. ఆ సమయంలో అక్కడ పనిచేసే ఒక సామాజిక కార్యకర్త ఆమెకు ఒక సైకిల్‌ని బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు మెవన్‌కు 29 ఏళ్లు.తాజాగా లండన్‌లో నివసిస్తున్న మెవన్ తన కుటుంబ మూలాలను వెతికే పనిలో పడింది. ఐదేళ్ల వయసులో తనకు సైకిల్ బహూకరించి తన పసిమనసును సంతోషపెట్టిన ఆ విశాల హృదయమున్న వ్యక్తి ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా బయటి ప్రపంచానికి తెలియచేస్తూ ఆ వ్యక్తి ఆచూకీని కనిపెట్టడంలో తనకు సాయపడవలసిందిగా నెటిజన్లను కోరింది. అయితే అనూహ్య రీతిలో ఆమె ట్వీట్‌కు స్పందనగా ప్రపంచవ్యాప్తంగా 3000 రీట్వీట్లు, 3 వార్తా కథనాలు, 1 వీడియోతోపాటు వేలాది సందేశాలు లభించాయి. చిన్నప్పుడు తనకు సైకిల్ బహూకరించిన వ్యక్తి ఆచూకీ లభించిందని, ఆయన పేరు ఎగ్‌బర్ట్ అంటూ మెవన్ సంతోషంగా ట్వీట్ చేసింది.ఆయనను కలుసుకున్న అనంతరం తమ సెల్ఫీని కూడా షేర్ చేసుకుంది మెవన్. తాను ఇచ్చిన చిన్నపాటి బహుమతి సైకిల్‌కు కృతజ్ఞత చెప్పవలసిన అవసరం లేదని ఎగ్‌బర్ట్ భావించినప్పటికీ అదే సైకిల్ 24 ఏళ్ల తర్వాత తమను కలిపినందుకు ఆనందపడ్డారని ఆమె వివరించింది. కాగా..ఎగ్‌బర్ట్‌ను మెవన్ కలుసుకుని కృతజ్ఞతలు చెప్పిన తీరుకు నెటిజన్లు చలించిపోయారు. మానవత్వానికి ఇంత కన్నా నిదర్శనం ఏముంటుందని పలువురు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇదో అద్భుతమైన ఘట్టం. ఈ అందమైన అన్వేషణ యాత్రలో మేము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉంది. మెవన్‌కు ధన్యవాదాలు అంటూ ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ అందరి స్పందనలను ప్రతిబింబిస్తోంది.





Untitled Document
Advertisements