కశ్మీర్‌లో ఏదో చేయడానికి ఇండియా ఆలోచిస్తోంది!

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 01:09 PM

కశ్మీర్‌లో ఏదో చేయడానికి ఇండియా ఆలోచిస్తోంది!

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా భారత సైన్యంపై ఆరోపణలు చేశారు. భారతదేశం సైనిక చర్యకు పథకం వేస్తోందని...పాకిస్థానీ కశ్మీర్‌లో ఏదో చేయడానికి ఇండియా ఆలోచిస్తోందని పాకిస్థానీ ఆర్మీ వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. ఆ చర్యను ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. తగిన సమాధానం చెబుతాం’ అని ఖాన్ స్పష్టం చేశారు. భారతదేశాన్ని దుయ్యబట్టేందుకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తమ దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని అవకాశంగా తీసుకున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్‌లో టెలివిజన్‌లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఇండియా రద్దు చేయడం, రాష్ట్రాన్ని కేంద్ర పాలనలోకి వచ్చే విధంగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడాన్ని పాక్ ప్రధాని తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారని ఎఎఫ్‌పి వార్తా సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా రెండు దేశాలమధ్య సంబంధాల్ని కూడా ఇమ్రాన్ ప్రస్తావించారు. ‘రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి ఇండియా ఒక అడుగు ముందుకేస్తే మేం రెండడుగులు వేస్తాం. కశ్మీర్‌లో కర్ఫూ మాటున తాము చేసేది ఏమిటో తెలీకుండా ప్రపంచం దృష్టి మళ్లించేందుకు ఇండియా ఒక ఆపరేషన్ నిర్వహిస్తుంది’ అని విమర్శించారు. జమ్మూకశ్మీర్ హోదాను మార్చి భారతీయులు పొరుగుదేశ ప్రజలను కలుసుకునేందుకు ఇంతవరకూ ఉన్న అవకాశాల్ని వమ్ము చేసిందని, కశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందని పాక్ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో తాము ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తగ్గించుకోవడం, రెండు దేశాల మధ్య రైలు, బస్సు రాకపోకల్ని నిలిపేయడం జరిగిందన్నారు. ‘ముస్లిం దేశాలు మద్దతివ్వకపోవడం దురదృష్టకరం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉండే 150 కోట్ల మంది ముస్లింలు కశ్మీరీల స్వయంపాలనపై మీ వైఖరి ఏమిటని ఐక్యరాజ్య సమితి వైపు చూస్తున్నారు’ అని ఇమ్రాన్ చెప్పారు. ఒకవేళ ఈ ప్రాంతంలో యుద్ధమే జరిగితే ప్రపంచానిదే బాధ్యత. ప్రపంచశాంతిని కోరుకునే ఐక్యరాజ్యసమితి వంటి వ్యవస్థలు అందుకు బాధ్యత వహించాలి’ అని ఇమ్రాన్‌ఖాన్ ఒక విధమైన హెచ్చరిక చేశారు.





Untitled Document
Advertisements