ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు!

     Written by : smtv Desk | Thu, Aug 15, 2019, 03:19 PM

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని ఒక సామెత ఉంది వినే ఉంటారు కదా. ఆ సామెతకు తగ్గట్టుగానే ఉల్లి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. దీన్ని పచ్చిగా లేదా వంటలో భాగంగా తీసుకున్నా చక్కటి ఫలితం ఉంటుంది. ఉల్లిపాయలో క్వెర్‌సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది మెటబాలిజంను పెంపొందించి శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయలో కేలరీలు, సోడియం తక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ సైతం అతి తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల ఉల్లిపాయను ఆహారంలో భాగంగా చేసుకుంటే త్వరగా బరువు తగ్గొచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి పరగడుపునే తీసుకోవడం వల్ల ఫలితం మెరుగ్గా ఉంటుంది. ఈ మిశ్రమం పొట్ట భాగంతోపాటు ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఉల్లిపాయ రసం, తెనే మిశ్రమం తయారీకి పెద్ద పరిమాణంలో ఉన్న ఒక ఉల్లిపాయ, తగిన మోతాదులో నీరు తీసుకోవాలి. 1-2 టీ స్పూన్ల తేనె అవసరం. ఉల్లిపాయ పొట్టు తీసి ముక్కలుగా కోసి బ్లెండర్‌లో వేయాలి. మిక్సీ పడుతూ దానికి తగిన మోతాదులో నీరు, తేనె కలపాలి. ఉల్లిపాయ రసంతో బరువు తగ్గడంతోపాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి, ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యం మెరుగుపడటానికి, బీపీ తగ్గడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. కేన్సర్లను కూడా అరికడుతుంది. ఉల్లిపాయలో విటమిన్ సి, విటమిన్ బీ6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరసర్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఉల్లిపాయలోని పీచు పదార్థం జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్లు బ్లడ్ షుగర్‌ను తగ్గిస్తాయి. ఉల్లి రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల జ్వరం, జలుబు, దగ్గు వెంటనే తగ్గుముఖం పడుతుంది. ఉల్లిపాయను తరచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.





Untitled Document
Advertisements