మిగిలింది ఒక టెస్ట్ సిరీసే!

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 11:35 AM

మిగిలింది ఒక టెస్ట్ సిరీసే!

టీంమిండియా-విండీస్ మధ్య జరుగుతున్న మూడు సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు జరిగిన వన్డే సిరీస్‌, టి20 సిరీస్‌లను కోహ్లీ సేన దక్కించుకుంది. ఇక మిగిలింది ఒక టెస్ట్ సిరీస్ మాత్రమె. టీమిండియా టి20 సిరీస్‌ను 30తో గెలుచుకున్న విషయం తెలిసిందే. వర్షం వల్ల మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య వెస్టిండీస్ జట్టు 35 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. తర్వాత డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 35 ఓవర్లలో 255 పరుగులుగా నిర్దేశించారు. ఈ లక్ష్యానని భారత్ 32.3 ఓవర్లలో నే కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛే దించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి సెంచరీ తో కదంతొక్కాడు. యువ ఆటగాడు శ్రేయస్ అ య్యర్ (65) కూడా తనవంతు పాత్ర పోషించాడు. దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది.క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (10) తక్కువ స్కోరుకే రనౌటయ్యాడు. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన రోహిత్ లేని పరుగు కోసం వెళ్లి రనౌటయ్యాడు. అయితే తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అతనికి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ అండగా నిలిచాడు. ఇద్దరు విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు.

తొలి రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించని ధావన్ ఈసారి మాత్రం కాస్త బాగానే ఆడాడు. కానీ, ఐదు ఫోర్లతో 36 పరుగులు చేసి చేజేతులా వికెట్‌ను పారేసుకున్నాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ సంచలనం రిషబ్ పంత్ (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 92 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ కోహ్లి, యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తమపై వేసుకున్నారు. ఇద్దరు విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. ఈ జోడీని విడగొట్టేందుకు విండీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కుదురుకున్న తర్వాత అయ్యర్ తన మార్క్ షాట్లతో అలరించాడు. కళ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. కిందటి మ్యాచ్‌లో కూడా అయ్యర్, కోహ్లిలు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్న విషయం తెలిసిందే.

ఈసారి కూడా అదే జోరును కొనసాగించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ 41 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో 3 ఫోర్లతో 65 పరుగులు చేశాడు.ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. తర్వాత వచ్చిన కేదార్ జాదవ్ అండతో కోహ్లి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి 99 బంతుల్లోనే 14 ఫోర్లతో 114 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్‌లో కోహ్లికి ఇది వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా కోహ్లి వన్డే కెరీర్‌లో ఇది 43వ శతకం. అంతేగాక కెప్టెన్‌గా వన్డేల్లో 21వ శతకం. వన్డేల్లో రికి పాంటింగ్ (ఆస్ట్రేలియా) 22 శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి ఈ రికార్డును సమం చేసేందుకు ఒక శతకం దూరంలో ఉన్నాడు. కాగా, కేదార్ జాదవ్ 19 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.ఈ మ్యాచ్‌కు వరుణుడు అడుగడుగున ఆటం కలిగించాడు. ఒక దశలో మ్యాచ్ జరగడం అసాధ్యంగా కనిపించింది. విండీస్ స్కోరు 22 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 158 పరుగుల వద్ద ఉన్నప్పుడు వర్షం మొదలైంది. చాలా సేపటి వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ జరగడంపై నీలి మేఘాలు అలుముకున్నాయి.

కానీ, వర్షం ఆగి పోవడంతో గ్రౌండ్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మైదానాన్ని ఆటకు అనుకూలంగా మార్చారు. ఇదే సమయంలో మ్యాచ్‌ను 35 ఓవర్లకు కుదించారు. ముందు బ్యాటింగ్ చేసిన విండీస్ 35 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ 41 బంతుల్లోనే ఐదు భారీ సిక్స్‌లు, మరో 8 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. ఎవిన్ లెవిస్ ఐదు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. పూరన్ మూడు సిక్సర్లతో వేగంగా 30 పరుగులు సాధించాడు. దీంతో విండీస్ క్లిష్టమైన లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. కాగా, విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా ఈ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన కోహ్లికి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. ఇక, ఇరు జట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతాయి.





Untitled Document
Advertisements