కేకేఆర్ హెడ్‌కోచ్‌గా బ్రెండన్ మెక్‌కలమ్

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 12:42 PM

కేకేఆర్ హెడ్‌కోచ్‌గా బ్రెండన్ మెక్‌కలమ్

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ హెడ్‌కోచ్‌గా తాజాగా నియమితులయ్యారు. ఈయన 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో విధ్వంసక సెంచరీతో అందరి చూపు ఈ టోర్నీపై పడేలా చేసిన మెక్‌కలమ్ సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో ఐదు సీజన్లు కోల్‌కతా టీమ్‌ తరఫున ఆడాడు. అయితే 2016‌లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ మాజీ ఓపెనర్.. ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. కానీ.. 2019 ఐపీఎల్ సీజన్‌‌లో మెక్‌కలమ్‌ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. 2020 ఐపీఎల్‌‌ని మెక్‌కలమ్ పర్యవేక్షణలోనే కోల్‌‌కతా నైట్‌రైడర్స్ ఆడనుందని ఆ జట్టు ఫ్రాంఛైజీ తాజాగా ప్రకటించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా 2008, ఏప్రిల్ 18న కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున బరిలోకి దిగిన మెక్‌కలమ్ (158 నాటౌట్: 73 బంతుల్లో 10x4, 13x6) విధ్వంసక శతకంతో చెలరేగాడు. దీంతో.. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగళూరు 15.1 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. అభిమానులకి ఐపీఎల్ మజాని పరిచయం చేసిన మ్యాచ్‌గా ఇది చరిత్రలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. 2008 నుంచి 2010 వరకూ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన మెక్‌కలమ్.. ఆ తర్వాత 2011 సీజన్‌లో వేరే జట్టుకి మారాడు. కానీ.. మళ్లీ 2012,13 సీజన్లలో కేకేఆర్‌కి ఆడాడు. 2012లో కోల్‌కతా జట్టు టైటిల్ గెలవడంలో మెక్‌కలమ్‌‌ క్రియాశీలక పాత్ర పోషించాడు. 2019 ఐపీఎల్ సీజన్‌ వరకూ హెడ్‌కోచ్‌గా ఉన్న దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ కలిస్‌ని ఇటీవల ఆ పదవి నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ తప్పించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements