కొత్త కోచ్ ఎవరు?

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 03:04 PM

కొత్త కోచ్ ఎవరు?

భారత జట్టు ప్రధాన కోచ్ ఎవరో శుక్రవారం తెలియనుంది. రాత్రి 7 ంటలకి కోచ్ ఎవరనేదానిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. హెడ్ కోచ్ కోసం వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన కపిల్‌దేవ్ కమిటీ ఆరుగుర్ని ఈరోజు ఇంటర్వ్యూలకి పిలిచింది. జాబితాలో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, ఫిల్ సిమన్స్, రాబిన్ సింగ్, మైక్ హసన్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు ఉన్నారు. అయితే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల బహిరంగంగా తన మద్దతుని రవిశాస్త్రికి తెలపడంతో.. అతడే మళ్లీ కోచ్‌గా ఎంపికయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2017లో అనిల్ కుంబ్లే తర్వాత హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి.. టీమిండియాని సమర్థంగా నడిపించాడు. అతడి పర్యవేక్షణలోనే ఏడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు టెస్టు సిరీస్ గెలిచింది. ఇంగ్లాండ్‌లో ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లో‌నూ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. దీంతో.. మరోసారి రవిశాస్త్రి‌నే కోచ్ పదవి వరించబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈరోజు అభ్యర్థులకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్న కపిల్‌దేవ్ నాయకత్వంలోని క్రికెట్ సలహా కమిటీ.. కొత్త కోచ్ పేరుని బీసీసీఐ పాలకుల కమిటీకి సూచిస్తుంది. ఆ తర్వాతే పాలకుల కమిటీ కొత్త కోచ్ పేరుని అధికారికంగా ప్రకటించనుంది. 2016లో విరాట్ కోహ్లీ తన మద్దతుని రవిశాస్త్రికి ప్రకటించగా.. బీసీసీఐ అప్పట్లో అనిల్ కుంబ్లేని కోచ్‌గా ప్రకటించింది. ఆ తర్వాత కోహ్లీ, కుంబ్లే మధ్య విభేదాలు తలెత్తగా.. హెడ్ మాస్టర్ తరహాలో కుంబ్లే వ్యవహరిస్తున్నాడంటూ బీసీసీఐకి టీమిండియా ఆటగాళ్లు ఫిర్యాదు చేశారు. దీంతో.. అవమానకరరీతిలో కోచ్ పదవికి కుంబ్లే రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో.. మరోసారి కెప్టెన్ కోహ్లీ అభీష్టానికి వ్యతిరేకంగా బీసీసీఐ నిర్ణయం తీసుకునే సాహసం చేయకపోవచ్చు.





Untitled Document
Advertisements