ఆర్థిక సమస్యలతో తల్లిదండ్రులతోపాటు భార్య బిడ్డలను చంపి ఆత్మహత్య

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 06:10 PM

ఆర్థిక సమస్యలతో తల్లిదండ్రులతోపాటు భార్య బిడ్డలను చంపి ఆత్మహత్య

కర్ణాటకలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఓ వ్యాపారి తన తల్లిదండ్రులతోపాటు భార్య బిడ్డలను తుపాకీతో కాల్చి చంపి, అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట పరిధిలో శుక్రవారం (ఆగస్టు 16) తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరుకు పట్టణానికి చెందిన వ్యాపారి ఓంకార్ ప్రసాద్ భట్టాచార్య (33) తన తల్లిదండ్రులు, భార్య, కొడుకులతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల ఓంకార్ ప్రసాద్ కుటుంబంతోసహా ఊరు వదిలి వెళ్లాడు. ఇటీవల బంధీపూర్ ఫారెస్ట్ సమీపంలోని యెలశెట్టి గ్రామంలో ఉన్న ఓ ఫాంహౌస్‌లో మాకాం మార్చారు. అయితే గత మూడు రోజుల కిందట గుండ్లుపేట్‌లోని నంది హోటల్‌‌కి వచ్చి అక్కడే ఉంటున్నారు. గురువారం రాత్రి ప్రసాద్ డ్రైవర్‌ను బయటకి పంపేశాడు. అనంతరం గుండ్లుపేట పట్టణానికి కిలోమీటరు దూరంలో ఉన్న శివారు ప్రాంతానికి ఓం ప్రసాద్ తన కుటుంబాన్ని తీసుకెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుపాకీతో తండ్రి నాగరాజ్ భట్టాచార్య (60), తల్లి హేమలత (54), భార్య నిఖిత (27), కుమారుడు ఆర్య కృష్ణ (5)లను కాల్చి చంపాడు. తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తుపాకీ ఓం ప్రసాద్ చేతిలో ఉండటంతో అతడే చంపి, ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చామరాజనగర్ ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.





Untitled Document
Advertisements