భారత్‌లో ఇంకా 72 శాతం మంది నగదుతో కూడిన లావాదేవీలు

     Written by : smtv Desk | Sat, Aug 17, 2019, 12:33 PM

న్యూఢిల్లీ: నగదు రహిత భారత్ కోసం ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీనికోసం ప్రభుత్వం దేశీయ, విదేశీ అనే తేడా లేకుండా అన్నింటికి అనుమతులు ఇచ్చేస్తోంది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో భారత్ చైనాతో పోటీపడుతోందని, దేశంలో పేమెంట్ యాప్‌ల సంఖ్య పెరిగిపోతోందని దక్షిణాసియా పేమెంట్స్ నెట్‌వర్క్ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్ నుంచి మరిన్ని పేమెంట్ యాప్స్ వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే చైనాలో మాత్రం దేశీయంగా తయారు చేసిన కేవలం రెండు యాప్స్ మాత్రమే మార్కెట్‌ను శాసిస్తున్నాయన్నారు.

నగదు రహిత లావాదేవీల్లో చైనాయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఈ క్రమంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని రకాల యాప్స్‌కి అవకాశం కల్పిస్తున్నామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దిలీప్ ఆస్బే తెలిపారు. అయినా భారత్‌లో డిజిటల్ చెల్లింపులపై అంతగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఈ క్రమంలో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యుపిఐ) వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గూగుల్, పేటీఎంతో పాటు దేశీయ ఆర్థిక సంస్థలకు చెందిన 87 యాప్స్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయినా భారత్‌లో ఇంకా 72 శాతం మంది నగదుతో కూడిన లావాదేవీలవైపే మొగ్గు చూపుతున్నారని ఇటీవల విడుదలైన ఓ అధికారిక నివేదికలో తేలింది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను అనుమతించడం లేదని నివేదిక తేల్చింది. 2015 తరవాత డిజిటల్ లావాదేవీలు ఐదింతలు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారులు సగటున 22.4 డిజిటల్ లావాదేవీలు జరిపినట్లు పేర్కొంది. అదే చైనాలో ఆ సంఖ్య 2017లోనే 99.7గా ఉన్నట్లు తెలిపింది. నోట్ల రద్దు తర్వాత నగదు చెలామణి కాస్త తగ్గినా.. గత రెండు సంవత్సరాలుగా మళ్లీ పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.





Untitled Document
Advertisements