టీమిండియాపై కోహ్లి పెత్తనం

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 11:38 AM

టీమిండియాపై కోహ్లి పెత్తనం

భారత జట్టులో కెప్టెన్ కోహ్లి పెత్తనం నడుస్తుంది. దీనికి ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి ఎంపికే నిదర్శనంగా చెప్పొచ్చు. గతంలో ఎప్పుడూ కూడా ఓ కెప్టెన్ క్రికెట్ బోర్డుపై తన ఆధిపత్యాన్ని చెలాయించేవాడు కాదు. కానీ, కోహ్లి సారథిగా వచ్చిన తర్వాత మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లేను ఆ పదవి నుంచి అవమానకరంగా తొలగించిన ఘనత కోహ్లికే దక్కుతోంది. ఇక, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రికి మరోసారి అవకాశం దక్కేందుకు కూడా కోహ్లి కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రస్తుతం భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై, సెలెక్షన్ కమిటీపై కోహ్లి స్పష్టమైన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. అతను ఏదీ కోరితే అది జరిగి తీరాల్సిందే. జట్టులో ఎవరుండాలి ఎవరిని తీసేయాలే అనేది కోహ్లి మాత్రమే నిర్ణయిస్తాడు. అతని నిర్ణయాన్ని కాదనే సాహసం ఇటు బోర్డు కానీ, పాలకుల కమిటీ కానీ చేయలేదు. ఇక సెలెక్షన్ కమిటీ కూడా కోహ్లి చెప్పిందే వినాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇక తాజాగా జరిగిన కోచ్ ఎంపిక ఇంటర్వూల్లో కోహ్లి తెరవెనుక పాత్ర స్పష్టంగా ఉందనే చెప్పాలి.టామ్ మూడీ, హెసన్ వంటి దిగ్గజాలు కూడా కోచ్ రేసులో ఉన్నా కపిల్‌దేవ్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ రవిశాస్త్రి వైపే మొగ్గు చూపింది. రవిని కాదని ఇతరులను ఎంపిక చేసేందుకు కపిల్ దేవ్ బృందం అంతగా ఆసక్తి కనబరచలేదనే చెప్పాలి. ఏదో తూతుమంత్రంగా ఇంటర్వూల ప్రక్రియాను సలహా కమిటీ నిర్వహించి చేతులు దులుపుకొంది. ఇక, ఈ మాత్రం దానికి కొన్ని రోజులుగా జరిగిన హడావిడిని చూస్తే ఆశ్చర్యం కలిగించక మానదు. రవిశాస్త్రిని ఎంపిక చేస్తారని ముందే తేలిపోయినప్పుడూ ఇంత హంగామా ఎందుకు చేశారో అంతుబట్టడం లేదు.

ఎప్పుడైతే కోహ్లి బహిరంగంగా రవిశాస్త్రికి మద్దతు తెలిపాడో అతని ఎంపిక ఖాయమని తేలి పోయింది. ప్రస్తుతం టీమిండియాపై కోహ్లికి ఉన్న పట్టును పరిగణలోకి తీసుకుంటే అతని నిర్ణయానికి నో అని చెప్పే సాహసం బోర్డు చేస్తుందని ఊహించలేం. ఇంటర్వూలు ప్రక్రియా జరిపించకుండా రవిశాస్త్రి పదవి కాలాన్ని పొడిగిస్తే సరిపోయేది. ఈ మాత్రం దానికి దరఖాస్తుల ఆహ్వానం, దాని కోసం ఓ కమిటీ ఏర్పాటు, భారీ ఎత్తున ప్రచారం చూస్తే విస్మయం కలుగక మానదు.

ఇతర జట్లు కూడా ప్రధాన కోచ్‌లను నియమించడం అనవాయితే. అయితే ఏ దేశ క్రికెట్ బోర్డు కూడా బిసిసిఐ మాదిరిగా అధిక ప్రచారం చేసుకోదు.మరోవైపు రవిశాస్త్రిని తిరిగి టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమించడాన్ని అభిమానులు జీర్ణించుకోవడం లేదు. రవిశాస్త్రిని ఎంపిక చేసి బిసిసిఐ పెద్ద పొరపాటు చేసిందని వారు ఆరోపిస్తున్నారు. కోచ్ ఎంపికపై కోహ్లి జోక్యం ఉందని వారు విమర్శిస్తున్నారు. గతంలో జట్టు ఎంపికలో కానీ, బోర్డు వ్యవహరాల్లో కానీ కెప్టెన్ జోక్యం ఉండేది కాదన్నారు. అయితే ఎప్పుడైతే కోహ్లి కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి సరికొత్త సంప్రదాయానికి తెరలేచిందని, జట్టు ప్రయోజనాలకు ఇది చాలా విఘాతమని వారు పేర్కొంటున్నారు.

ఇక, దరఖాస్తుల ప్రక్రియా కూడా పూర్తి కాకుండానే కోహ్లి చేసిన ప్రకటనను వారు తప్పుపడుతున్నారు. ఇంటర్వూలు జరగక ముందే రవిశాస్త్రికి మద్దతు తెలపడం పెద్ద పొరపాటని వారు విమర్శిస్తున్నారు. కోచ్ ఎంపికలో సలహా కమిటీ నిష్పక్షపాతంగా వ్యవహరించలేక పోయిందని, కోహ్లి ఒత్తిడికి వారు తలొగ్గారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఇక, రవిశాస్త్రి ఎంపికతో టీమిండియా మరోసారి తిరోగమనంలో ప్రయాణించడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. కోహ్లి, రవిశాస్త్రిలు కీలక పదవుల్లో ఉన్నంత కాలం భారత జట్టు మెగా టోర్నీల్లో ట్రోఫీలు సాధించడం అసాధ్యమని వారు స్పష్టం చేస్తున్నారు.





Untitled Document
Advertisements