అందుకే రంగోలి నన్ను చీప్‌ నటి అందేమో

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 12:38 PM

టాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభించి బాలీవుడ్‌లో నిలదొక్కుకున్న నటి తాప్సీ. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రం విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా చక్కటి వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలో తాప్సీ ఓ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఫెమినిజం గురించి ముచ్చటించారు. ‘మీ పరంగా బాలీవుడ్‌ ఐకాన్స్‌ ఎవరు?’ అని ప్రశ్నించగా.. ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్‌, అనుష్క శర్మల పేర్లు చెప్పారు.

‘ప్రియాంకా చోప్రా తనను తాను నిరూపించుకున్న విధానం అద్భుతం. కంగన తనకు కావాల్సిన దాని కోసం గళమెత్తి మాట్లాడుతుంది, అది గొప్ప విషయం. అనుష్క చాలా నిజాయితీగా ఉంటారు. అందుకే వీరి ముగ్గురి పేర్లు చెప్పాను. నా దృష్టిలో ఫెమినిజానికి సరైన అర్థం పురుషులతోపాటు సమానంగా అవకాశాలు రావడం. మన నైపుణ్యాన్ని అందరికీ తెలియజేయాలంటే ముందు అవకాశం రావడం ఎంతో ముఖ్యం’ అని ఆమె అన్నారు.

కంగన సోదరి రంగోలి ఇటీవల తాప్సీపై వ్యాఖ్యలు చేశారు. కంగనను తాప్సీ కాపీ చేస్తోందని విమర్శించారు. దీని గురించి తాప్సీ స్పందిస్తూ.. ‘కంగనకు రింగురింగుల జుట్టు ఉందని, నేను కూడా రింగురింగుల జుట్టుతో పుట్టలేదు. దీనికి నా తల్లిదండ్రులు బాధ్యులు. కాబట్టి దానికి నేను క్షమాపణ చెప్పలేను. నేను ఏం కాపీ కొట్టానో నాకే తెలియదు. ఓ మంచి నటికి నేను కాపీ అయితే ఇకపై ఎప్పుడూ అలానే ఉంటాను. దీన్ని ప్రశంసగా తీసుకుంటాను. నన్ను చీప్‌ అన్నారు. నిజమే.. నేను భారీ పారితోషికం తీసుకునే నటిని కాదు. అందుకే రంగోలి నన్ను చీప్‌ నటి అందేమో’ అని తాప్సీ తనస్టైల్‌లో సమాధానం ఇచ్చారు.

Untitled Document
Advertisements