పాకిస్థాన్‌కు అండగా ఉన్న చైనాకు షాక్!

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 12:41 PM

పాకిస్థాన్‌కు అండగా ఉన్న చైనాకు షాక్!

జమ్ముకాశ్మీర్ అంశంపై భద్రతా మండలిలో రహస్య సమావేశం శుక్రవారం జరిగింది. ఇది కేవలం ఆంరంగిక, అందులోనూ అనధికారిక సమావేశం, నిర్ణయాలకు అతీతంగా సాగిన ఈ భేటీలో మెజార్టీ స్థాయిలో భారతదేశ నిర్ణయాలకు మద్దతు దక్కింది. దీనితో పాకిస్థాన్‌కు తెరవెనుక పెద్దన్న పాత్రలో ఉన్న చైనాకు ఆశాభంగం ఎదురైంది.15 దేశాల అత్యంత శక్తివంతమైన మండలి ఐరాసకు ఆయువుపట్టు వంటి విభాగం. చైనా కోరుకున్నట్లు భేటీ జరిగింది. అయితే ఇది రహస్య సమావేశంగా ఎటువంటి ఫలితం లేకుండా అనంతర ప్రకటన వంటి తంతులు లేకుండా ముగిసింది. ఏదేనీ అంశం ఉంటే ఢిల్లీ ఇస్లామాబాద్‌లు తేల్చుకోవల్సి ఉంటుందని సభ్యదేశాలు పేర్కొన్నట్లు వెల్లడైంది. ఓ గంట సేపు రహస్య చర్చలు జరిగాయి. చర్చల దశ ముగిసిందని ఆ తరువాత ఐరాసలోని చైనా రాయబారి ఝాంగ్ జున్, పాకిస్థాన్ ప్రతినిధి మలీహా లోధీలు వరుసగా వేర్వేరుగా ప్రకటనలు గుప్పించారు. అయితే విలేకరుల ప్రశ్నలకు జవాబివ్వలేదు.అంతర్గత మండలి భేటీ తరువాత ఏదో ఒక నిర్థిష్ట ప్రకటనను వెలువరించాలని చైనా సూచించింది. ఏదో ఒక ఫలితం దిశలోనే భేటీ జరగాలని కోరింది. ఆగస్టు నెలకు మండలి నిర్వహణ బాధ్యతలలో ఉన్న పోలెండ్ ప్రతినిధితో కొద్ది సేపు చైనా రాయబారి మంతనాలు నిర్వహించారు. మీడియాకు ఏదో ఒక విషయం స్పష్టం చేయాలని చైనాతో పాటు బ్రిటన్ కూడా పేర్కొందని వెల్లడైంది. అయితే కశ్మీర్ అంశాన్ని ఐరాసలో ప్రస్తావించిన పాకిస్థాన్‌కు ఎటువంటి ఊతం దక్కలేదని, పరిస్థితిపై పట్టు దక్కించుకోవాలనే తపనలో పాకిస్థాన్ చతికిలపడిందని ఐరాస వర్గాలు తెలిపాయి.భేటీలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. చైనా పాకిస్థాన్‌లు కోరినట్లు ఎటువంటి ప్రకటన వెలువరించేందుకు మండలి నిర్వహణ బాధ్యతల్లో ఉన్న పోలెండ్ సమ్మతించలేదు. అంశంపై ఎటువంటి ప్రకటన లేదా ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని అత్యధిక సభ్యదేశాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో రష్యా తన వాదనను బాగా విన్పించింది. దీనితో చేసేది లేక దేశాల స్థాయిల్లోనే ఆ తరువాత చైనా, పాకిస్థాన్‌లు విలేకరుల సమావేశాన్ని మొక్కుబడిగా ముగించి వేశాయి.కశ్మీర్‌పై దేశం తీసుకున్న నిర్ణయం గురించి భారతదేశం ప్రతినిధి బృందం మండలి సభ్యులకు అంశాలవారిగా వివరణలు ఇచ్చుకుంది. మొత్తం మీద అత్యంత సమర్థవంతమైన వాదనను రూపొందించుకుంది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దిన్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశ జాతీయ వైఖరిని తెలియచేయడం జరుగుతుందని, ఏది ఏమైనా దేశాల కోణంలో వెలువడే ప్రకటనలు విషయాన్ని అంతర్జాతీయం చేయలేవని ఆయన పరోక్షంగా చైనా పాకిస్థాన్‌లకు చురకలు పెట్టారు.పాకిస్థాన్ చైనాలను అంశాల వారిగా తిప్పికొట్టడంలో ఇండియా విజయం సాధించింది. ఆర్టికల్ 370 ఎత్తివేతను పాకిస్థాన్ శాంతి భద్రతలకు భంగకరం అనడాన్ని భారతదేశం తిప్పికొట్టింది. ఒక సర్వసత్తాక స్వతంత్ర దేశపు రాజ్యాంగ అంతర్గత వ్యవహారాన్ని వేరే కోణంలోకి తీసుకుపోవాలని యత్నించడం కుదరదని భారతదేశం తన వాదనను సభ్య దేశాలకు తెలియచేసుకుంది. అంతర్గత సర్దుబాట్ల అంశం సరిహద్దులు దాటి వెళ్లడం అనుచితం అవుతుందని పేర్కొంది. భారతదేశ అంశాలవారి ప్రచార ప్రభావం భద్రతా మండలి అంతర్గత భేటీలో స్పష్టం అయిందని , దీని ఫలితంగానే మండలి సమావేశం ప్రకటనలు నిర్ణయాల తంతు లేకుండా ముగిసిందని వెల్లడైంది.





Untitled Document
Advertisements