సరదాగా మొదలవుతుంది...ప్రాణం తీసుకెళ్తుంది!

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 02:54 PM

సరదాగా మొదలవుతుంది...ప్రాణం తీసుకెళ్తుంది!

సరదాకోసం మొదలు పెట్టి అడిక్ట్ అయిపోయేదాకా వేదించే డ్రగ్ సిగరెట్. ఒక్క రోజు సిగరెట్ తాగకపోతే ఆ రోజంతా పిచ్చెక్కినట్టుగా, చిరాగ్గా ఉంటుంది. కొందరైతే రోజుకు ఒక సిగరెట్‌తో మొదలు పెట్టి.. క్రమంగా రోజుకో పెట్టె వరకూ పీల్చేస్తుంటారు.ఎక్కువ మందికి కాలేజీ రోజుల్లో సిగరెట్ తాగే అలవాటుకి బీజం పడుతుంది. పొగతాగే అలవాటు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది చనిపోతున్నారంటే ఇది ఎంతటి హానికరమో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు పొగాకు వల్ల వచ్చే రోగాల కారణంగా ఏటా 1.4 ట్రిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. పొగాకు కారణంగా ఏటా చనిపోయే 70 లక్షల మందిలో నేరుగా పొగతాగడం వల్ల 60 లక్షల మంది చనిపోతున్నారు. మరో 8,90,000 మంది పక్కనోళ్లు వదిలిన పొగ పీల్చడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. పొగాకు కారణంగా చనిపోతున్న వారిలో దాదాపు సగం మందికి గుండె జబ్బులే కారణం. గుండె సంబంధిత జబ్బులతో చనిపోయే వారిలో 17 శాతానికిపైగా పొగరాయుళ్లే. ఒకరు వదిలిన ‘పొగ’ను పీల్చడం కూడా తీవ్ర దుష్ఫలితాలకు కారణం అవుతోంది. సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం, అకాల మరణాలు, రకరకాల రోగాల బారిన పడటం లాంటి ముప్పులు పెరుగుతున్నాయి. రోజుకు ఎన్ని ఎక్కువ సిగరెట్లు తాగితే.. గుండె జబ్బులు అంత ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. నేను రోజుకో సిగరెట్ మాత్రమే కాలుస్తా బాస్.. ఏం ఫర్వాలేదు అనుకుంటున్నారా..? రోజులో ఒక్క సిగరెట్ కాల్చినా సరే.. గుండె జబ్బుల ముప్పు సాధారణం కంటే రెట్టింపు అవుతుందట. ఈ-సిగరెట్లతోనూ ఈ ముప్పు తప్పదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది. పొగాకు నమిలినా సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అని చెబుతోంది. మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. పొగతాగే అలవాటు వల్ల గుండె జబ్బులు వస్తాయని చాలా మందికి తెలీదు. మన దేశంలో 36 శాతం మందికి స్మోకింగ్ వల్ల హార్ట్ఎటాక్ వస్తుందని తెలీదు. 51 శాతం మందైతే.. సిగరెట్ వల్ల గుండె జబ్బులు వస్తాయననే విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. చైనాలో ఇంకా దారుణం, అక్కడ 61 శాతం మంది పెద్దలకి హార్ట్ ఎటాక్‌కి, స్మోకింగ్‌కి సంబంధం ఉందని తెలీదు.





Untitled Document
Advertisements