సరదాగా బయటికెల్లింది...డైమండ్ సొంతం చేసుకుంది

     Written by : smtv Desk | Thu, Aug 22, 2019, 06:16 PM

సరదాగా బయటికెల్లింది...డైమండ్ సొంతం చేసుకుంది

సరదా కోసం ఓ పార్కుకు వెళ్ళిన మహిళకు అదృష్ట దేవత ఎదురయ్యింది. ఆమెకు 3.72 క్యారెట్ల డైమండ్‌ దొరికింది. ఈ ఘటన అమెరికాలోని ఆర్కన్‌సాస్‌లో గల క్రాటర్‌ ఆఫ్‌ డైమండ్స్‌ పార్కులో జరిగింది. ప్రజలను లోనికి అనుమతించే ప్రపంచంలోని ఏకైక డైమండ్‌ పార్కు ఇదేనన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెక్సాస్‌కు చెందిన మిరాండా హోలింగ్‌షెడ్‌ గత శుక్రవారం తన కుటుంబంతో కలిసి ఈ పార్కుకు వెళ్లారు. వజ్రాల వేట గురించి యూట్యూబ్‌లో వీడియో చూస్తూ తన కొడుకుతో సరదాగా ఆడుకుంటున్నారు. అదే సమయంలో రెండు రాళ్ల మధ్య వజ్రం ఉండటాన్ని గమనించి వెంటనే దానిని ఒడిసిపట్టుకున్నారు. ఈ విషయం గురించి మిరాండా మాట్లాడుతూ..' వజ్రాల వేట కొనసాగించడం ఎలా అనే వీడియో చూస్తున్న సమయంలోనే నాకు ఈ విలువైన పసుపు పచ్చ వజ్రం దొరికింది. ఇది నన్నెంతో ఉద్వేగానికి గురిచేసింది. దీనిని ఎవరూ కొనకపోతే ఉంగరం చేయించుకుంటా' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా గత వందేళ్ల కాలంలో ఈ డైమండ్‌ పార్కులో సందర్శకులకు వేలాది వజ్రాలు దొరికాయని అక్కడి అధికారులు తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఒడ్డుకు కొట్టుకువచ్చిన వజ్రం మిరాండాకు దొరికిందని అభిప్రాయపడ్డారు. ఇక ఈ విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో..' అబ్బ ఎంత అదృష్టమో మీది. భలేగా వజ్రం సొంతం చేసుకున్నారే' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.





Untitled Document
Advertisements