నాడా చేసిన తప్పుకు మేమెందుకు భారం మోయాలి?

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 05:04 PM

నాడా చేసిన తప్పుకు మేమెందుకు భారం మోయాలి?

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ బాత్రా నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా)పై ధ్వజమెత్తారు. నేషనల్ డోప్ టెస్టింగ్ లేబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) అధికారిక గుర్తింపుని ఆర్నెళ్ల పాటు రద్దు చేస్తూ వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ(వాడా) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ బాత్రా మాట్లాడుతూ "ఇప్పుడు మేము రూపాయలకు బదులు డాలర్లలో చెల్లించాలి. నా బాధ ఏంటంటే ఈ ఖర్చును భరించేది ఎవరు?" అని ప్రశ్నిస్తూ, తప్పు మీరు చేస్తే డాలర్లు మేం చెల్లించాలా? అంటూ నిలదీశారు. "అదనపు ఖర్చుని తట్టుకునే పరిస్థితుల్లో నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ లేవు. నాడా చేసిన తప్పుకు మేమెందుకు అదనపు భారం మోయాలి? ఈ అంశంపై ఏడాది నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఎన్‌డీటీఎల్‌ ప్రయోగ పద్ధతుల్లో లోపాలను వాడా ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూనే ఉంది. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దడంలో నాడా విఫలమైంది" అని బాత్రా అన్నారు.నేషనల్ డోప్ టెస్టింగ్ లేబొరేటరీ(ఎన్‌డీటీఎల్‌) అధికారిక గుర్తింపుని రద్దు చేసినప్పటికీ నాడా డోప్‌ పరీక్షలు నిర్వహించుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. సేకరించిన ఆటగాళ్ల నమూనాలను(బ్లడ్, యారిన్) ఇతర దేశాల్లోని గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించుకోవచ్చని వాడా స్పష్టం చేసింది.ఎన్‌డీటీఎల్‌ను రద్దు చేయడానికి గల కారణాలను సైతం వాడా వెల్లడించింది. ఎన్‌డీటీఎల్‌ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే గుర్తింపు రద్దునకు కారణమని వాడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవలే ఎన్‌డీటీఎల్‌లో లేబరోటరీ ఎక్సపర్ట్ గ్రూప్(ల్యాబ్ఈజీ) చేపట్టిన తనిఖీల్లో వెల్లడైందని తెలిపారు.వాడా తన వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారం మేరకు వాడా లేబొరేటరీ నిపుణుల బృందం మేలో తినిఖీలు ప్రారంభించిందని, ఆ తర్వాత ఓ స్వతంత్ర క్రమశిక్షణా కమిటీ కూడా దర్యాప్తు చేసిందని అందులో పేర్కొంది. ఆ నివేదికల ఆధారంగా వాడా ఎక్జిక్యూటివ్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది.ఎన్‌డీటీఎల్‌పై నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని కూడా వాడా స్పష్టం చేసింది. ఈ నిషేధిత సమయంలో ఇప్పటివరకు ఎన్‌డీటీఎల్‌ ల్యాబ్‌లో ఉన్న నామూనాలను గుర్తింపు పొందిన ఇతర ల్యాబ్‌లకు పంపించాల్సిందిగా వాడా సూచించింది. నిబంధనల ప్రకారం వాడా నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ఎన్‌డీటీఎల్‌ 21 రోజుల్లోగా కోర్ట్ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(సీఏఎస్‌)ని ఆశ్రయించే వెసులుబాటు ఉంది.

Untitled Document
Advertisements