సెమీస్‌కు సింధు...అలుపెరుగని పోరాటంతో విజయం

     Written by : smtv Desk | Fri, Aug 23, 2019, 07:47 PM

సెమీస్‌కు సింధు...అలుపెరుగని పోరాటంతో విజయం

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్విట్జర్లాండ్‌లోని బాసెల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం చైనీస్ తైపీ షట్లర్ తైజు యింగ్‌తో ఢీకొన్న పీవీ సింధు 12-21, 23-21, 21-19 తేడాతో విజయాన్ని అందుకుంది. తాజా విజయంతో సెమీస్‌లో అడుగుపెట్టిన పీవీ సింధు.. పసిడి పతకానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది. తైజు యింగ్‌పై అంత మెరుగైన రికార్డ్‌లేని పీవీ సింధు.. తొలి సెట్‌ని 12-21 తేడాతో చేజార్చుకుని భారత్‌లో కంగారు పెంచింది. ఇప్పటికే సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో.. పతక ఆశలు రేపిన పీవీ సింధు రెండో సెట్‌లో పుంజుకోగలదా..? అనిపించింది. కానీ.. ఒత్తిడిలో ఆడటాన్ని అలవాటు చేసుకున్న సింధు.. రెండో సెట్‌ని ఆఖరి వరకూ పోరాడి 23-21తో చేజిక్కించుకుని మళ్లీ రేసులోకి వచ్చింది. దీంతో మూడో సెట్‌పై ఉత్కంఠ నెలకొంది. విజేత నిర్ణయాత్మక మూడో సెట్‌ని పేలవంగా 1-4తో ప్రారంభించిన పీవీ సింధు.. కొద్దిసేపటికే ప్రత్యర్థి ఆధిక్యాన్ని 3-5, 6-9 తరహాలో తగ్గించుకుంటూ కొద్దిసేపటికే 15-15తో సమం చేసింది. ఇక్కడ నుంచి గేమ్ నువ్వా- నేనా అన్నట్లు సాగింది. అయితే.. ఆఖర్లో తైజు యింగ్‌ తప్పిదాలు చేయడంతో ఎలాంటి అవకాశాన్ని ఆమెకి ఇవ్వని సింధు 21-19తో సెట్‌ని చేజార్చుకుని గెలుపు సంబరాల్లో మునిగిపోయింది.

Untitled Document
Advertisements