ప్రతిపక్షాలు ఇంకా దీనిపై ఎందుకు రచ్చ చేస్తున్నాయో తెలీదు

     Written by : smtv Desk | Tue, Sep 17, 2019, 11:00 AM

నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. దానిలో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎంపీ రేవంత్ రెడ్డి, టిజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ఇంకా పలువురు ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు. అందరూ ముక్తకంఠంతో యురేనియం త్రవ్వకాలను వ్యతిరేకించారు. తెలంగాణ ప్రభుత్వం యురేనియం త్రవ్వకాలకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలను పూర్తిగా నిషేదించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాల సమావేశంపై తెరాస ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పందిస్తూ, “రాష్ట్ర ప్రభుత్వం యురేనియం త్రవ్వకాలను అనుమతించబోమని శాసనసభలో హామీ ఇస్తుంటే, ప్రతిపక్షాలు ఇంకా దీనిపై ఎందుకు రచ్చ చేస్తున్నాయో తెలీదు. ప్రజలలో అపోహలు, అనుమానాలు సృష్టించేందుకే ప్రతిపక్షాలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నాను. అయినా వారి సమావేశం ఛాయ్-బిస్కట్ల సమావేశం మాత్రమే. పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రాలో ఏమీ చేయలేకనే తెలంగాణ రాజకీయాలలో వేలుపెడుతున్నారిప్పుడు,” అని అన్నారు.





Untitled Document
Advertisements