ఆసరా పెన్షన్‌ల పథకంలో అవినీతి ముఠా అరెస్ట్

     Written by : smtv Desk | Tue, Sep 17, 2019, 09:01 PM

ఆసరా పెన్షన్‌ల పథకంలో అవినీతి ముఠా అరెస్ట్

వృద్ధుల ఆసరా పెన్షన్‌ల పథకంలో అవినీతికి పాల్పడిన ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని బండ్లగూడాలోని నలుగురు నిందితులు మహ్మద్ అస్లాం, సయ్యద్ సోహలుద్దీన్, మోసిన్, మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్‌లు వృద్ధుల ఆసరా పెన్షన్‌ల పథకంలో అవినీతికి పాల్పడ్డారు. వీరిని సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆసరా స్కాంపై హైదరాబాద్ కలెక్టర్ మానిక్ రాజు, హైదరాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి డి.శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు అసరా స్కాంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పాత బస్తీకి చెందిన 255మంది సంబంధించిన రూ. 25లక్షల ఆసరా పెన్షన్‌ల మొత్తాలను ఈ ముఠా మూడు నెలల నుండి తమ ఖాతాల్లోకి డైవర్ట్ చేస్తున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ముఠాలో కీలక పాత్రధారి, ప్రభుత్వ ఉద్యోగి ఇమ్రాన్ సోహెల్ అస్లాం సహాయంతో చార్మినార్ ఎమ్మార్వో పాస్‌వర్డ్, యూసర్‌తో ఆసరా పింఛన్లను దారి మళ్లించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. దీంతో అస్లాంను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కోన్నారు. కాగా 2017లో కూడా అస్లాం పెన్షన్‌ల స్కాంకు పాల్పడటంతో జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పాతబస్తీలోని 255 మంది వృద్ధుల పింఛన్లను 3 నెలలుగా దారి మళ్లించినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఆసరా పింఛన్ల లబ్దిదారుల మొత్తాలను ఎస్‌బిఐ, సిండికేట్,ఆంధ్రాబ్యాంక్‌లతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు వెరసి 63 బ్యాంకులకు తరలించినట్లు తేలింది. ఈ కేసులోని నిందితులు బండ్లగూడాలోని లబ్దిదారుల డేటాను సేకరించేందుకు ఒక మహిళను ఏర్పాటు చేసుకున్నారని, అలాగే అసలు లబ్దిదారుల స్థానంలో నకిలీ లబ్దిదారులను సృష్టించి పింఛన్ల మొత్తాలు కాజేశారు. నిందితులపై 66సి, ఐటిఎ చట్టం 2008, 419,420 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆసరా పింఛన్ల స్కాంను అడిషినల్ డిసిపి కెసిఎస్ రఘువీర్ ఆధ్వర్యంలో సిఐ బి.రమేష్, ఎస్‌లు మదన్, కానిస్టేబుళ్లు ఫిరోజ్, అబ్దుల్ కరీం, శ్రీధరచారి, శేఖర్‌లు ఛేదించారు. అనతికాలంలో కేసులో పురోగతి సాధించిన సిబ్బందిని అడిషనల్ డిసిపి రఘువీర్ అభినందించారు.





Untitled Document
Advertisements