రోహిత్ VS శుభమన్

     Written by : smtv Desk | Tue, Sep 17, 2019, 11:09 PM

రోహిత్  VS శుభమన్

అక్టోబరు 2 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌‌కి భారత ఓపెనర్ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఈ సిరీస్‌ కోసం రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్‌ను ఓపెనర్లుగా ఇటీవల సెలక్టర్లు ఎంపిక చేయగా.. గిల్ ఇప్పటి వరకూ భారత్ తరఫున ఒక్క టెస్టు కూడా ఆడకపోవడంతో అతడికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని అంతా ఊహించారు. కానీ.. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరుగుతున్న అనధికార టెస్టు సిరీస్‌లో ఈ యువ ఓపెనర్ నిలకడగా రాణిస్తున్నాడు. మైసూర్ వేదికగా దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో తాజాగా జరుగుతున్న రెండో అనధికార టెస్టులో భారత-ఎ జట్టు తరఫున బరిలోకి దిగిన శుభమన్ గిల్ (52 నాటౌట్: 80 బంతుల్లో) నిలకడగా ఆడుతున్నాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. మొదట ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత-ఎ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ అభిమన్యు (5), ప్రియాంక్ (6) వికెట్లను చేజార్చుకుంది. అయితే.. ఓపెనర్‌గా బరిలోకి దిగిన శుభమన్ గిల్ నిలకడగా ఆడుతూ భారత ఇన్నింగ్స్‌ని నడిపిస్తున్నాడు. అతనికి కరుణ్ నాయర్ (19 నాటౌట్: 44) నుంచి సహకారం లభిస్తుండటంతో.. భారత-ఎ జట్టు 26 ఓవర్లు ముగిసే సమయానికి 82/2తో కోలుకుంది.సఫారీ యువ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొంటూ శుభమన్ గిల్ కొడుతున్న ఫోర్లకి మ్యాచ్‌ కామెంటేటర్లు సైతం ముగ్ధులవుతున్నారు. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతోనే ఇటీవల ముగిసిన మొదటి అనధికార టెస్టు మ్యాచ్‌లోనూ శుభమన్ గిల్ 90 పరుగులు చేయగా.. ఆ మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.రెండో అనధికార టెస్టు మ్యాచ్‌లో శుభమన్ గిల్ శతకం సాధిస్తే..? దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో అతనికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయం. అదే జరిగితే.. అప్పుడు రోహిత్ శర్మ లేదా మయాంక్ అగర్వాల్‌లో ఒకరు రిజర్వ్ బెంచ్‌కి పరిమితం కావాల్సి ఉంటుంది. ఇటీవల వెస్టిండీస్‌లో పర్యటించిన భారత్-ఎ జట్టు తరఫున డబుల్ సెంచరీ బాదిన శుభమన్ గిల్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకూ 14 మ్యాచ్‌లాడిన ఈ 20 ఏళ్ల బ్యాట్స్‌మెన్ 72.15 సగటుతో ఏకంగా 1,443 పరుగులు చేయగా.. ఇందులో 4 సెంచరీలతో పాటు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులకి భారత జట్టు ఇదే: విరాట్ కోహ్లి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాహా (రెండో వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, శుభమన్ గిల్





Untitled Document
Advertisements