ఇరు జట్లకు ఈ మ్యాచ్ సవాలే

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 03:55 AM

ఇరు జట్లకు ఈ మ్యాచ్ సవాలే

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షార్పణం కావడంతో బుధవారం రెండో టి20 జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ఆతిథ్య భారత్‌కు అటు దక్షిణాఫ్రికాకు కీలకంగా మారింది. రెండు జట్లు కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమయ్యాయి. తొలి మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు కావడంతో ఇరు జట్ల ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. ఈ సిరీస్ కోసం రెండు జట్లకు చెందిన యువ ఆటగాళ్లు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కానీ, తొలి మ్యాచ్‌లో వీరి ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మొహాలిలో జరిగే రెండో టి20 మ్యాచ్ సాఫీగా సాగే అవకాశాలున్నాయి. వాతావరణ శాఖ కూడా వర్షం గురించి ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. కాగా, ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్‌ను సవాలుగా తీసుకున్నాయి. సిరీస్‌లో బోణీ కొట్టేందుకు తహతహలాడుతున్నాయి. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. కానీ, యువ ఆటగాళ్లతో కూడిన దక్షిణాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే డేవిడ్ మిల్లర్, డికాక్, రబడా, డుసెన్, జూనియర్ డలా తదితరులు ఆ జట్టుకు అందుబాటులో ఉన్నారు. ఇక, టీమిండియా కూడా రానున్న ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ క్రికెటర్లకు జట్టులో చోటు కల్పించింది. బౌలింగ్ విభాగాల్లో సీనియర్లకు విశ్రాంతి కల్పించి యువకులకు అవకాశం కల్పించింది. ఒక్క హార్దిక్ పాండ్య మినహా మిగతా స్పీడ్‌స్టర్లకు పెద్దగా అనుభవం లేదనే చెప్పాలి. అయితే బ్యాటింగ్‌లో మాత్రం సీనియర్లు జట్టులో ఉన్నారు.ఈ మ్యాచ్‌లో సీనియర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే కెఎల్.రాహుల్ పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. మొహాలి గ్రౌండ్‌లో ధావన్‌కు అద్భుత రికార్డు ఉంది. టెస్టుల్లో, వన్డేల్లో కూడా శతకాలతో అలరించాడు. ఈసారి కూడా సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. స్టార్ ఓపెనర్ రోహిత్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా రానున్న టెస్టు సిరీస్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తున్నాడు. కొంతకాలంగా రోహిత్ అసాధారణ రీతిలో చెలరేగి పోతున్నాడు. ప్రపంచ కప్‌లో వరుస సెంచరీలతో ప్రకంపనలు సృష్టించాడు. వెస్టిండీస్ సిరీస్‌లో కూడా మెరుపులు మెరిపించాడు. ఈసారి కూడా సౌతాఫ్రికాకు తన బ్యాట్ పవర్ చూపించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన రోహిత్ విజృంభిస్తే సౌతాఫ్రికా బౌలర్ల కష్టాలు రెట్టింపు కావడం ఖాయం. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా జోరు మీదున్నాడు.





Untitled Document
Advertisements