రైతుబంధు పథకంలో 56.76 లక్షల మంది రైతులు

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 04:55 AM

రైతుబంధు పథకంలో  56.76 లక్షల మంది రైతులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్ర సర్కార్ కాపీ కొట్టిందని, అంతేకాక ఈ పథకం కింద అనేక షరతులను కేంద్రం విధించిందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రెండోరోజు ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా రైతుబంధు పథకానికి సంబంధించిన పలు ప్రశ్నలను సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ పథకంపై చల్ల ధర్మారెడ్డి, బాల్క సుమన్, కోనేరు కొనప్ప, పోడెం వీరయ్యలు ప్రశ్నలను లేవనెత్తగా, ఈ ప్రశ్నలకు సమాధానంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. రెండు పంటలకు రూ. 10 వేలు చెల్లిస్తున్నామ న్నారు. గతేడాది ఈ పథకం కింద రూ. 10,505 కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. రైతుబంధు పథకం కింద ఈ సంవత్సరం 56.76 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించామని, ఇప్పటికే 39.72 లక్షల మంది రైతు ఖాతాల్లో డబ్బులను జమచేశామని ఆయన పేర్కొన్నారు. మిగిలిన రైతులకు చెల్లింపులు ప్రాసెస్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో అనేక షరతులు ఉన్నాయన్నారు. కేవలం ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా కేంద్రం చెల్లిస్తుందన్నారు. రైతుబంధు, రైతుబీమా కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన డాటాబేస్‌ను ప్రామాణికంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. కిసాన్ సమ్మాన్ యోజన కింద రాష్ట్రం లో 33 లక్షల మందిని లబ్ధిదారులుగా కేంద్రం గుర్తించిందన్నారు. 75వేల రైతులకు రూ.125 కోట్లను కేంద్రం చెల్లించిందన్నారు. తెలంగాణలో అమలు చేసే రైతుబంధు పథకంలో ఎలాంటి షరతులు లేవన్నారు. ఇప్పటికే ఈ పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిందన్నారు. గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద సుమారు రూ.10 వేల కోట్లు చెల్లించిందన్నారు.





Untitled Document
Advertisements