వీటి పనైపోయినట్టేనా!

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 05:23 AM

వీటి పనైపోయినట్టేనా!

108 వాహనాల పనైపోయింది. ఈ వాహనాల్లో 50 శాతానికి పైగా కాలం చెల్లినవే. ఈమేరకు రవాణాశాఖ జూన్‌లోనే ఈ వాహనాలకు నోటీసులు జారీ చేసి, నూతన ప్రభుత్వానికి నివేదించింది. కానీ అధికారం చేపట్టి మూడు నెలలు గడుస్తున్నా, ప్రభుత్వం 108సేవల ప్రక్షాళనకు చర్యలు ప్రారంభించ లేదు. జగన్‌ ప్రభుత్వంలోనూ 108 సేవల తీరు మారకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 439 వాహనాల్లో 200కు పైగా వాహనాలు కాలం చెల్లినవి కావడం, మరో 115 మండలాల్లో వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రమాదబారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విజయనగరం జిల్లాలో 34 మండలాలకు కేవలం 27వాహనాలు మాత్రమే ఉన్నాయి. అందులో 13వాహనాలు కాలం చెల్లినవంటూ రవాణాశాఖ గతంలో నోటీసు జారీ చేసింది. అందులో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన పాచిపెంట, మక్కువ, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాలతో పాటు మైదాన ప్రాంతంలోని ఎస్‌.కోట, గజపతినగరం, జామి, గరివిడి మండలాలకు చెందిన వాహనాలు ఉన్నాయి. జిల్లాలో మరో ఏడు మండలాలకు వాహన సదుపాయమే లేదు. ఈ నేపథ్యంలోనే అత్యవసర సమయంలో రోగుల చెంతకు వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.





Untitled Document
Advertisements